పవన్ కల్యాణ్ కు ఆమె గుర్తున్నారో లేదో కానీ.. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆమెను ఏపీకి ప్రచారానికి తీసుకు వచ్చి సాష్టాంగ నమస్కారం కూడా చేసుకున్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఇలా పవన్ కల్యాణ్ గతంలో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు ఆయనకే గుర్తుందో లేదో తెలియని పార్టీ బీఎస్పీ. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన కూటమిలోని ఒక పార్టీ ఇది.
మాయవతికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ అప్పట్లో ప్రచారం చేసుకున్నారు పవన్ కల్యాణ్. అయితే గత ఎన్నికల్లో తనేదో ఒంటరి పోరు చేసి వీరమరణం అంటూ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఇలాంటి పార్టీలన్నింటినీ తను వెంట తీసుకెళ్లిన విషయాన్ని తన కన్వీనెంట్ గా మరిచిపోయినట్టుగా ఉన్నారు. కమ్యూనిస్టులనూ, మాయవతి పార్టీని తీసుకెళ్లి అప్పట్లో కూడా చంద్రబాబు ఆటలో పేక ముక్కయ్యారు పవన్ కల్యాణ్.
మరి ఈ సారికి పవన్ కల్యాణ్ కు కమ్యూనిస్టులను కానీ బీఎస్పీని కానీ కలుపుకుపోయే ఉత్సాహం ఏదీ లేదు. ఈ సారి డైరెక్టుగా చంద్రబాబుతో బాహాటమైన పొత్తు కోసమే వపన్ ఆరాటపడుతూ ఉన్నారు. ఈయన సంగతిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో సోలో పోరాటం అంటూ మాయవతి ప్రకటించుకున్నారు.
గత ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ వెళ్లి ఎస్పీతో జత కట్టింది. బీజేపీని ఓడించే లక్ష్యంతో కూటమిని ఏర్పాటు చేసి అక్కడి వైరి పక్షాలు. ఎంపీ సీట్లను పంచుకుని బీజేపీని ఢీ కొట్టడానికి ప్రయత్నించాయి. అయితే అది విఫల యత్నమే అయ్యింది. ఎస్పీ పది ఎంపీ సీట్లను సంపాదించుకోగా, బీఎస్పీ ఐదు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది.
ఎన్నికల అనంతరం మాయవతి స్పందిస్తూ.. తమ పార్టీ ఓట్లు ఎస్పీకి పడ్డాయి తప్ప, ఎస్పీ ఓట్లు తమకు పడలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు అని ఆమె ప్రకటించుకున్నారు. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఎస్పీ తేలిపోయింది. ఒకానొక దశలో సోషల్ ఇంజనీరింగ్ తో యూపీలో ఒంటి చేత్తో అధికారాన్ని చేపట్టిన మాయవతికి ఇప్పుడు తను ఎంపీగా గెలవడం కూడా కష్టమే అనే పరిస్థితి ఉంది. మరి ఒంటరి పోరు అంటున్న మాయ రాజకీయ శక్తి తగ్గినా పోరాట పటిమను అయితే చూపడానికి వెనుకాడటం లేదు!