ఎన్నిక ఏదైనా వైసీపీ తరపున ఆయన రంగంలోకి దిగాల్సిందే. అందుకే ఆయన్ను వైసీపీ ఎన్నికల స్పెషలిస్ట్‌గా ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, ఇటీవల బద్వేల్ ఉప ఎన్నిక, తాజాగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక…. అంతా ఆయన నేతృత్వమే. పెద్దిరెడ్డి నాయకత్వం అంటే గెలుపునకు సంకేతమనే సెంటిమెంట్ వైసీపీలో నెలకుంది. ఆయన అడుగు పెట్టాడంటే చాలు… ప్రత్యర్థులకు వెన్నులో వణుకు.
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను పాలకప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండు పార్టీల్లోని కీలక నాయకులు కుప్పంలో మకాం వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు అక్కడ రంగంలోకి దిగి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎంతో ముందుగానే అక్కడ రెండు రోజులు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారంటే ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పానికి వెళ్లారు. కుప్పం మున్సిపాలిటీ బరిలో నిలిచిన 25 వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలతో పెద్దిరెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తన అభిప్రాయాలను నేతలతో ఆయన పంచుకున్నారు. ఇంటింటికి తిరిగి గత రెండున్నరేళ్లలో అందజేసిన సంక్షేమ పథకాల గురించి గుర్తు చేసి, ఓట్లను అభ్యర్థించాలని దిశానిర్దేశం చేశారు.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కంటే… ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలే వైసీపీకి ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడు టీడీపీని ఓడించి కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ పాగా వేయడం ద్వారా చంద్రబాబుకు ఓటమి రుచి ముందే చూపొచ్చని వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో నిలిచేందుకు బాబు భయపడేలా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎలాగైనా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా రెపరెపలాడేలా నాయకులంతా సమష్టిగా పని చేయాలని కోరారు. పెద్దిరెడ్డి రాకతో కుప్పం వైసీపీలో జోష్ కనిపించింది. గెలుపుపై భరోసా కలిగించడంలో పెద్దిరెడ్డి సఫలం అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.