హుజూరాబాద్ బై పోల్ కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం రౌండ్ రౌండ్ కూ పెరుగుతూ ఉంది. తొలి మూడు రౌండ్ల కౌంటింగ్ ఫలితాలు వెల్లడయ్యే సరికి… బీజేపీ అభ్యర్థి 1269 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. తొలి రెండు రౌండ్లతో పోలిస్తే మూడో రౌండ్ లో ఈటల కు మెరుగైన మెజారిటీ దక్కింది. దీంతో ఆయనకు మూడు రౌండ్ల మెజారిటీ వెయ్యిని దాటింది. మరి ఇదే పరిస్థితి 22 రౌండ్ల కౌంటింగ్ లో కొనసాగుతుందా? లేక ఈ ట్రెండ్ కాస్త మారి టీఆర్ఎస్ మళ్లీ ముందంజలోకి వస్తుందా అనేది ఇంకా కొశ్చన్ మార్కే.
మూడు రౌండ్ల మెజారిటీ కేవలం వెయ్యికి కాస్త అటూ ఇటుగానే ఉంది కాబట్టి.. అప్పుడే బీజేపీ సంబరాలు చేసేసుకునే పరిస్థితి లేదు. కనీసం పది రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎంతో కొంత స్పష్టత లేనట్టే. పది రౌండ్ల వరకూ ఈటల ఇదే స్థాయిలో మెజారిటీని పెంచుకుంటూ పోతే.. విజయంపై ధీమా మరింత పెరగొచ్చు.
ఇక హుజూరాబాద్ పోరులో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం మరో విశేషమైన అంశం. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాకా కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం ఐదు వందల ఓట్లను కూడా సాధించలేకపోయింది. తొలి రౌండ్లో అయితే కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. రోటీ మేకర్ గుర్తు మీద పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లను పొందాడు. కారు గుర్తును పోలి ఉన్న రోటీ మేకర్ తొలి రౌండ్లోనే వందకు పైగా ఓట్లను పొందడం టీఆర్ఎస్ కు అసహనాన్ని రేపింది.
ఈవీఎంల మీద రోటీ మేకర్ గుర్తు కారును పోలి ఉంటోందని, దాని వల్ల తమకు హోరాహోరీ పోరు ఉన్న చోట నష్టం కలుగుతోందని టీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అది ఇండిపెండెంట్ గుర్తు కాదని, అదొక రిజిస్టర్డ్ పార్టీ గుర్తు కావడంతో… ఆ గుర్తు ప్రతి పోరులోనూ వస్తోందని సమాచారం. దీంతో ఈ సారి కూడా రోటీ మేకర్ టీఆర్ఎస్ కు బాగానే నష్టం చేస్తున్నట్టుగా ఉంది. ఇలాంటి తకరారు గుర్తు పొందిన ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ పొందలేకపోవడం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో అరవై వేల ఓట్లను పొందిన పార్టీ ఇప్పుడు అంతిమంగా రెండు మూడు వేల ఓట్లనైనా పొందుతుందా అనేది ప్రశ్నార్థకం కావడం గమనార్హం. ఇదంతా కాంగ్రెస్ లాలూచీ ఫలితం అని కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పూర్తిగా బీజేపీ వైపు మళ్లించిందనే విశ్లేషణా వినిపిస్తోంది.
తాము చిత్తయినా ఫర్వాలేదు టీఆర్ఎస్ ను ఓడించాలనే లెక్కతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా ఈటల వైపు మొగ్గందని, ఓట్ల చీలకతో టీఆర్ఎస్ కు లాభం కలుగుతుంది కాబట్టి, తాము పోటీలో ఉన్నా లేని పరిస్థితిని కాంగ్రెస్సే కల్పించిందనే మాట వినిపిస్తోంది. పోలింగ్ కు ముందే టీఆర్ఎస్ ఇదే ఆరోపణ చేసింది. బీజేపీతో కాంగ్రెస్ పూర్తిగా చేతులు కలిపిందని టీఆర్ఎస్ ముఖ్య నేతలే అన్నారు.
కాంగ్రెస్ కు మరీ రౌండ్ కో వంద ఓట్లు కూడా రావడం కష్టం అయిన నేపథ్యంలో.. ఆ పార్టీ టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో తననే చిత్తు చేసుకుందా అనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి.