పవన్ కల్యాణ్ పై ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై వైసీపీకి ఇన్నాళ్లకు ఓ క్లారిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఏ కామెంట్ చేసినా దానికి కౌంటర్లు ఇవ్వడం, అంతా కలిసి ఖండించడం చేసేవారు. అలా పరోక్షంగా పవన్ ను రాజకీయాల్లో హీరోను చేశారు. దీని వల్ల ఎవరికి ఉపయోగం? ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయిన పవన్ కల్యాణ్ కే ఉపయోగం. అందుకే ఈసారి వైసీపీ పవన్ విషయంలో సైలెంట్ అయింది. మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
అఖిలపక్షం భేటీపై వారం రోజుల్లోగా స్పందించాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల పక్షం పెట్టకపోతే ఆందోళనకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. సాధారణంగా అయితే దీనిపై పేర్నినాని, నారాయణస్వామి, కొడాలి, అనీల్ కుమార్ లాంటి నేతలు ఘాటుగా స్పందించాలి. కానీ వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
పవన్ కామెంట్లకు స్పందించడం మానేసింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఏ అంశంతో అయితే రాజకీయ లబ్ది పొందాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారో, అదే అంశంతో పవన్ కల్యాణ్ కు సంబంధం లేకుండా చేయాలనే ఎత్తుగడ వేసింది వైసీపీ.
స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కల్యాణ్ ను లైట్ తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ అంశంపై ఇప్పటికే సీరియస్ గా ఉన్న వైసీపీ అధిష్టానం, పవన్ వ్యాఖ్యలపై స్పందించి మరోసారి అతడికి ఎలివేషన్ ఇచ్చి తప్పు చేయకూడదని డిసైడ్ అయింది. ఫలితంగా అఖిలపక్షం అంటూ పవన్ డిమాండ్ చేసి 3 రోజులు అవుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
అలా అని ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో ఉదాసీనంగా ఉండడం లేదు. పవన్ చెప్పిన అఖిలపక్షం కాన్సెప్ట్ ను పక్కనపెట్టి.. అంతకంటే మెరుగైన ఆలోచనతో ముందుకొచ్చింది. కార్మిక సంఘాల నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలతో సమావేశాలు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. అఖిలపక్షం పెట్టి మరో తీర్మానం చేసే కంటే, ఇలా కార్మిక సంఘాల్ని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లడం అత్యుత్తమమైన ఆలోచన.
మొత్తమ్మీద స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబించబోతోంది.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ అంశంతో పవన్ కల్యాణ్ కు కనెక్షన్ కట్ చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. దానికి సంబంధించి గేమ్ ప్లాన్ ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది.