మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రచారానికి ఇంకా తెరతీయలేదు. వాస్తవానికి ఇంకా విడుదలకు చాలా టైమ్ వుంది కూడా. అయితే ఈ సినిమాతో పోటీగా వస్తున్న బన్నీ-త్రివిక్రమ్ అల వైకుంఠపురములో ప్రచారం మాత్రం ముందుగానే ప్రారంభించేయడంతో 'సరిలేరు' యూనిట్ పై వత్తిడి పెరిగిన మాట వాస్తవం. అయితే డిసెంబర్ మొదటివారం నుంచి ప్రచారం ప్రారంభించాలని ఇఫ్పటి వరకు 'సరిలేరు' యూనిట్ అనుకుంటూ వస్తోంది.
కానీ ఇఫ్పుడు లేటెస్ట్ ఆలోచనలు వేరుగా వున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండోవారం నుంచి ప్రచారం ప్రారంభిస్తే ఎలా వుంటుంది అన్న పాయింట్ దిశగా డిస్కషన్ల నడుస్తున్నాయి. సరిలేరు సినిమాకు పబ్లిసిటీ కంటెంట్ చాలా వుంది. టీజర్, పాటలు, చిన్న చిన్న విడియోలు ఇలా చాలా వున్నాయి. వారానికి ఒకటి వేసుకున్నా, డిసెంబర్ లో వున్నవి నాలుగు వారాలే. అందువల్ల మరో రెండు వారాలు ముందుగా మొదలు పెడితే బెటర్ అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో మహేష్ బాబు కేరళ వెళ్లే హడావుడిలో వున్నారు. అందువల్ల ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతానికి పబ్లిసిటీ డే టు డే చార్ట్ మాత్రం తయారుచేసి, వాళ్ల అప్రూవల్ కు రెడీ గా వుంచినట్లు బోగట్టా. అక్కడ ఓకె అయిపోతే నవంబర్ రెండోవారంలో సరిలేరు ప్రచారం స్టార్ట్ అయిపోతుంది. ఇక అప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ హడావుడి మొదలవుతుంది.