రాను రాను అమెజాన్ ప్రయిమ్ ఆక్టోపస్ లా విస్తరిస్తోంది. తెలుగు సినిమా ప్రియులు అందరూ అమెజాన్ ప్రయిమ్ తో అనుసంధానమై వున్నారు. పెద్ద సినిమాలు 45 రోజులకు, మీడియం సినిమాలు 30 రోజలకు అమెజాన్ ప్రయిమ్ లో వస్తున్నాయి. ఇవి ఇలావుంటే మరీ చిన్న సినిమాలను షేరింగ్ పద్దతిలో కూడా తీసుకుంటున్నారు. అలాగే పాత సినిమాలను కూడా. దాంతో చాలామంది అమెజాన్ ప్రయిమ్ లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని చూసే పరిస్థితి వచ్చేసింది.
ఇలాంటి నేపథ్యంలో ఇటీవల విడుదలయిన ఓ సినిమా రెండు వారాలకే అమెజాన్ ప్రయిమ్ లోకి వచ్చేసింది. ఆది సాయికుమార్ నటించి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమా అనేక బాలారిష్టాలు దాటి ఆ మధ్య విడుదలయింది. కానీ పాపం, బాక్సాఫీస్ దగ్గర కుదేలయిపోయింది. అస్సలు చూసేవారే కరువయ్యారు.
ఇప్పుడు ఆ సినిమాను అమెజాన్ ప్రయిమ్ లోకి వదిలేసారు. అక్టోబర్ 18న విడుదలయిన సినిమా రెండువారాలు కాకుండానే అక్టోబర్ 31న ప్రయిమ్ లో ప్రత్యక్షమైపోయింది. గతంలో సినిమా విడుదలయిన వారానికి, రెండు వారాలకు పైరసీ సీడీలు వచ్చేవి. ఇప్పుడు ప్రయిమ్ లో వస్తోంది. అంతే తేడా.