కడప నుంచి అమెరికా. ఇంజనీర్ గా వెళ్లి ఎంటర్ ప్రెన్యూర్ గా మారిన వైనం. అక్కడితో ఆగకుండా రాజకీయ అభీష్టం నెరవేర్చుకునే ప్రయత్నం. ఆ విధంగా అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవీ స్వీకారం. ఇదీ పండుగాయల రత్నాకర్ ప్రస్థానం.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రత్నాకర్ కు యంగ్ ఏజ్ నుంచి రాజకీయాలంటే ఇష్టం. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, ప్రజా ప్రతినిధి కావాలని కోరిక. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ ఫాలోవర్ గా మార్చింది ఈ ఆసక్తే. ఆ తరువాత వైఎస్ కు పూర్తి అభిమానిగా మారారు. ఆ తరువాత వైఎస్ తనయుడు జగన్ వెంట నడిచారు.
అమెరికా వెళ్లినా, వ్యాపారాలు చేసినా, వైఎస్ కుటుంబ అభిమానం వీడలేదు. అందుకే అమెరికాలో వైకాపా పార్టీ నేతగా ఎదిగారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నార్త్ అమెరికాలో ప్రత్యేక ప్రతినిధి. ఆ పదవి స్వీకరించి, ఆ పదవి ఆలంబనగా అటు అమెరికాకు ఇటు ఆంధ్రకు 'సేవావారథి' నిర్మించే పనిలో వున్నారు రత్నాకర్.
అమెరికా ఆంధ్రుల సహకారంతో తెలుగునాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు, అభిరుచులు, అభిప్రాయాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు రూపొందించే పనిలో వున్నారు రత్నాకర్. అమెరికాలో అందరినీ కలుపుకుని పోవాలని, అందరి సహకారంతో తెలుగునాట మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ పథకాలు, నవరత్నాలకు అనుగుణంగా వివిధ ఆలోచనలు సాగించి, ఆచరణలోకి తీసుకురావాలని తమను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని రత్నకర్ చెబుతున్నారు.
అమెరికాలో అనేక సంఘాలు వుండొచ్చు. రకరకాల ఎజెండాలు వుండొచ్చు. కానీ వారందరిని కలుపుకుని, పుట్టిన నేలకు ఏదో ఒకటి చేయాలనే అందరి సంకల్పాన్ని ఒకటి చేసి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నది తమ ఆలోచన అని ఆయన వివరిస్తున్నారు. వైఎస్ ను మించిన నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకుంటున్నారని, దేశం మొత్తం మీదనే చెప్పుకునే రీతిలో పాలన సాగిస్తున్నారని రత్నాకర్ అన్నారు.
జగన్ వచ్చాక వానలు విపరీతంగా కురుస్తున్నాయని, నదులు, వాగులు అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయని, రాయలసీమ కూడా పచ్చగా కనిపిస్తోందని ఆయన గుర్తుచేసారు. ప్రతి వర్గానికి కావాల్సిన ప్రతి ఒక్కటి చూస్తున్నారని, ఇస్తున్నపథకాలు అందరికీ అందుతున్నాయో లేదో పక్కాగా పరిశీలన సాగిస్తున్నారని, అదే సమయంలో ప్రతి విషయంలో ట్రాన్స్ పెరెన్సీ అన్నది వుండేలా చూసుకుంటున్నారని ఆయన అన్నారు.
జగన్ చేస్తున్న నవ్య ప్రయత్నాలకు తాము, తమతో పాటు వున్న ఎన్నారైలు అందరూ అండగా వుంటామని, తమకు వీలయిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని రత్నాకర్ అన్నారు.