పెళ్లి చూపులు సినిమా దగ్గర నుంచి తాను సంపాదించిన దాంట్లో 70శాతం ఖర్చు చేసి 'మీకు మాత్రమే చెప్తా' సినిమా చేసాను అని హీరో విజయ్ దేవరకొండ ఓపెన్ గా చెప్పేసారు. కాస్త ఆశ్చర్యంగా వుంది ఈ స్టేట్ మెంట్.
ఎందుకంటే మీకు మాత్రమే చెప్తా సినిమాకు జస్ట్ రెండు కోట్లు మాత్రమే ఖర్చయిందని, ప్రచారంతో కలిపి మహా అయితే ఎంత ఎక్కువ లెక్క వేసుకున్నా మూడు కోట్లు దాటదని ట్రేడ్ వర్గాల బోగట్టా.
సినిమాను ఫస్ట్ కాపీ అవుట్ రేట్ గా ఏషియన్ సునీల్ తీసుకున్నారు. రెండు కోట్లకు పైగానే ఇచ్చారని వార్తలు వున్నాయి. అది కాక సినిమా శాటిలైట్ అయింది. అది కూడా బాగానే డబ్బులు తెచ్చింది. సరే ఈ ఆదాయాల సంగతి అలా వుంచితే, సినిమాకు రెండు మూడు కోట్లు మాత్రమే ఖర్చయితే విజయ్ తన సంపాదనలో 70 శాతం ఈ సినిమాకే పెట్టానని అనడం ఆశ్చర్యమే.
ఎందుకంటే గీతగోవిందం వరకు విజయ్ సంపాదన అంతంత మాత్రమే. అది అంగీకరించాల్సిన విషయం. కానీ డియర్ కామ్రేడ్ కు ఒక్కసారిగా రెమ్యూనిరేషన్ మారిపోయింది. తొమ్మిది కోట్ల వరకు మైత్రీ మూవీస్ పారితోషికం ఇచ్చిందని గ్యాసిప్ లు వున్నాయి. హీరో సినిమా కు కూడా అదే రీతిలో ఇచ్చారు.
ఇది కాక కేఎస్ రామారావు సినిమా వుండనే వుంది. పోనీ అన్ని సినిమాలు కలిపి ఎలా లేదన్నా ఇప్పటి వరకు విజయ్ సంపాదన ఇరవై కోట్లు కచ్చితంగా వుంటుంది. అది ఆయన కష్టార్జితం. దాన్ని కాదనే వారు ఎవ్వరూ లేరు. జమా ఖర్చులు చెప్పాల్సిన అవసరమూ లేదు. కానీ మొత్తం ఓ బుల్లి, బుజ్జి సినిమా మీద ఖర్చు చేసానని చెప్పడమే బాగాలేదు.
ఆ విధంగా సెంటిమెంట్ కార్డ్ ప్లే చేయాలనుకుంటున్నారేమో విజయ్?