రామ్గోపాల్ వర్మ ఎలాగైనా మాట్లాడతాడు. అది ఆయనిష్టం. పబ్లిసిటీ కోసం వర్మ ఏం చేయడానికైనా వెనుకాడడని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది.
తాజాగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుని ఉద్దేశించి ఒకింత జుగుప్సాకరమైన వ్యాఖ్యలే చేశాడు రామ్గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా. సినీ పాటల రచయిత, కవి అయిన జొన్నవిత్తులపై వర్మ ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డానికి కారణం లేకపోలేదు.
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రమోషన్లో భాగంగా వర్మ ఈ మధ్యనే ఓ ట్రైలర్ విడుదల చేసిన విషయం విదితమే. ఆ ట్రైలర్ జొన్నవిత్తులకి నచ్చలేదు.
ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వర్మ మీద తనదైన స్టయిల్లో ఓ పాటేసుకున్నాడాయన. అంతే, వర్మకి ఒళ్ళు మండిపోయింది. పదేళ్ళకోసారైనా స్త్రీతో ఎంజాయ్ చేస్తే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుందని వర్మ, సోషల్ మీడియా వేదికగా ఉచిత సలహా ఇచ్చేశాడు జొన్నవిత్తులకి.
అంతే కాదు, 'నీ భార్యా పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్.. వాళ్ళ మీద జాలేస్తోంది స్వీట్ హార్ట్.. కానీ ఐ లవ్ యూ డా' అంటూ తెలుగులో జొన్నవిత్తులపై వర్మ ట్వీటేయడం గమనార్హమిక్కడ. 'తెలుగులో ట్వీట్లు నేను వేయను.. అలా వేసినవి నా ట్వీట్లు కావు..' అని కొన్నాళ్ళ క్రితం వర్మ ప్రకటించిన విషయం విదితమే. అది అప్పటి మాట.. మాట మీద నిలబడటం వర్మకు తెలియదనుకోండి.. అది వేరే విషయం.
మొత్తమ్మీద, వర్మ తాను తీస్తోన్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకి తాను ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ పొందుతున్నాడన్నమాట. సినిమా కోసం పబ్లిసిటీ కాదు, పబ్లిసిటీ కోసం సినిమా.. దటీజ్ రామ్ గోపాల్ వర్మ. అన్నట్టు వర్మ స్థాయికి తగ్గిపోయి జొన్నవిత్తుల, వర్మ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడగలరంటారా.?