ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు విషయాన్ని మరిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక పరిణామాల మధ్య వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు స్వీకరించింది.
వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. కడప, పులివెందులలో సీబీఐ బృంధాలు తిష్టవేసి మరీ విచారించాయి. ఇందులో భాగంగా వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల్ని కూడా విచారించి అందరిలో ఉత్కంఠ రేకెత్తించారు.
చివరికి ఈ కేసులో నలుగురిని నిందితులుగా తేల్చుతూ పులివెందుల న్యాయస్థానంలో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఎర్రగంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలను నిందితులుగా సీబీఐ నిర్ధారించింది.వీరిలో ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లను సీబీఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి మాత్రం బెయిల్‌పై బయట ఉన్నారు.
సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో నలుగురి నిందితుల పాత్ర ఏంటనేది పేర్కొంది. ఇంత వరకూ బాగానే ఉంది. అసలు వివేకాను హత్య చేయడానికి కారణాలేంటనేది చర్చకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వివేకా లాంటి సౌమ్యుడిని హత్య చేయాలన్నంత కసి వారిలో కలగడానికి కారణాలేంటో సీబీఐ చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిందితులంతా సామాన్యులే. ఏ వివాదాలు వివేకా హత్యకు వారిని ప్రేరేపించాయనేది మిస్టరీగా మారింది.
సీబీఐ ఇంత కాలం చేసిన దర్యాప్తులో తేలిందేంటి? అనేది చర్చనీయాంశమైంది. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. వివేకా చర్య ఏంటి? అందుకు ప్రతిచర్యగా నిందితులు హత్యకు పథక రచన చేయాల్సిన పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ప్రజానీకం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. సీబీఐ అభియోగపత్రం చూస్తుంటే…అంతా మొక్కుబడి వ్యవహారంలా కనిపిస్తోందనే విమర్శలున్నాయి.