ఎప్పుడైతే పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీ అయిందో, అప్పట్నుంచి అల్లు అర్జున్ మాటలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉన్నాయి. అందర్నీ కలుపుకుపోయేలా మాట్లాడ్డం, బాలీవుడ్-కోలీవుడ్ లాంటి ఇతర పరిశ్రమల గురించి కూడా మాట్లాడ్డం ఎక్కువైంది. తాజాగా మైక్ అందుకున్న బన్నీ ఈసారి కూడా అలానే మాట్లాడాడు.
వరుడు కావలెను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు బన్నీ. సాధారణంగా ఏ సినిమా ఫంక్షన్ కు వచ్చినా ఆ సినిమాతో పాటు, అదే రోజు విడుదలవుతున్న ఇతర సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు మాట్లాడతారు గెస్టులు. బన్నీ కూడా అలానే మాట్లాడాడు. వరుడు కావలెను సినిమాతో పాటు రొమాంటిక్ అనే మూవీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానన్నాడు.
అయితే అక్కడితో ఆగిపోలేదు. తమిళనాట రజనీకాంత్ నటిస్తున్న సినిమా, కన్నడ పరిశ్రమలో విడుదలవుతున్న మరో పెద్ద సినిమా, బాలీవుడ్ లో రిలీజ్ అవ్వబోతున్న ఇంకో పెద్ద సినిమా కూడా హిట్ అవ్వాలని అన్నాడు అల్లు అర్జున్.
గడిచిన 50 ఏళ్లలో సినీపరిశ్రమ ఎప్పుడూ ఇంత డౌన్ అవ్వలేదని, తిరిగి పూర్వవైభవం రావాలంటే అన్ని పరిశ్రమల్లో ఈ అన్ని సినిమాలు బాగా ఆడాలన్నాడు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా వస్తోంది పుష్ప. డిసెంబర్ లో విడుదలకాబోతున్న ఆ సినిమా కోసం తనకు దొరికిన ప్రతి వేదికపై ప్రచారం కల్పిస్తున్నాడు అల్లు అర్జున్. తగ్గేదేలే అంటూ డైలాగ్స్ కొడుతున్నాడు. తన సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకు బన్నీ గట్టిగానే ట్రై చేస్తున్నాడు.