టికెట్ ల జీవో సంగతి సిఎమ్ కు తెలుసా?

ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ వాస్తవానికి ఆ నిర్ణయం అమలు కావడం లేదు. ఈ విషయంలో కోర్టులో కేసు కూడా నడిచింది. జీవో అమలు చేయమని ఆదేశాలు…

ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ వాస్తవానికి ఆ నిర్ణయం అమలు కావడం లేదు. ఈ విషయంలో కోర్టులో కేసు కూడా నడిచింది. జీవో అమలు చేయమని ఆదేశాలు కూడా వెలువడ్డాయి. కానీ ఇంకా ఆంధ్రలో మాత్రం పాత రేట్లే అమలు చేస్తున్నారు. అందుకే ధైర్యంగా సినిమాలు విడుదల చేస్తున్నారు. 

గమ్మత్తేమిటంటే పాత రేట్లకే అమ్ముతున్నారని, జగన్ నిర్ణయం గాలికిపోయిందన్న సంగతి మంత్రి పేర్ని నానికి కూడా తెలుసు అని తెలుస్తోంది. 

టికెట్ రేట్ల సవరణ గురించి సినిమా జనం మంత్రి పేర్ని నానితో ప్రస్తావిస్తే…' ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? టికెట్ ల జీవో మీద ప్రభుత్వం ఏమీ సీరియస్ గా లేదు కదా? థియేటర్లను వత్తిడి చేయడం లేదు కదా?' అని అన్నట్లు తెలుస్తోంది. అంటే దీనిని బట్టి ప్రభుత్వం కావాలనే కొత్త రేట్ల జీవో అమలు చేయడం లేదా? ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ కు తెలుసా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జీఎస్టీ సంగతేమిటి?

ఇదిలా వుంటే పాత రేట్లకే అమ్మడం సంగతి అలా వుంచితే ఆ పాత రేట్ల మీదే జీఎస్టీ కూడా కడుతున్నారు. అంటే పాత రేట్లకు విక్రయిస్తున్నారు అన్న దానికి సాక్ష్యం ఈ జీఎస్టీ నే. భవిష్యత్ లో ప్రభుత్వ జీవో అమలు కావడం లేదని, కోర్టు ఆదేశించినా ఫలితం లేదని ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ జీఎస్టీ చెల్లింపులే సాక్ష్యంగా నిలుస్తాయని ఓ నిర్మాత తెలిపారు. అలాంటపుడు అందరూ కోర్టు మెట్లు ఎక్కాల్సి వుంటుందేమో అన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేసారు. 

మొత్తం మీద ఆంధ్రలో టికెట్ రేట్లు రాకపోయినా సినిమా ఇండస్ట్రీకి సమస్య ఏమీ లేనట్లే అనుకోవాలి. ఎందుకంటే పాత రేట్లు హ్యాపీగా అమ్మేసుకుంటున్నారు. అడ్డేమీ లేదు. అధికారుల నుంచి సమస్య లేదు. బహుశా అందుకే కూడా ప్రభుత్వం రేట్ల సవరణ జీవో ఇవ్వడానికి కూడా పెద్దగా ముందుకు రావడం లేదేమో?