పేదల ఇళ్ల స్థలాలపై కోర్టుకెక్కి, వాళ్ల ఆశలను కూల్చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో వణుకు పుట్టింది. దీంతో ఆ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు టీడీపీ నానా తిప్పలు పడుతోంది. గత రెండేళ్లుగా వివిధ రకాల సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సాగిస్తున్న వికృత క్రీడ గురించి అందరికీ తెలిసిందే.
సుమారు 25 లక్షల మంది ఆడబిడ్డల సొంతింటి కలను నెరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. మిగిలిన అభివృద్ధి పనుల విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా…హామీలను నెరవేర్చడంలో మాత్రం జగన్ ముందు వరుసలో ఉన్నారు.
ఇందులో భాగంగా మొదటగా ఇంటి స్థలాల పంపిణీని విజయవంతంగా పూర్తి చేశారు. చాలా తక్కువ ప్రాంతాల్లో అది కూడా టీడీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల ఇంటి స్థలాల పంపిణీ ఆగిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ, శ్రద్ధ తీసుకుంది.
ఇలాంటి సమయంలో ఉరుములు మెరుపులు లేకుండా పిడుగు పడ్డ చందంగా పేదల సొంతింటి కలల సౌధంపై టీడీపీ స్టే పిడుగు వేసింది. దీంతో ఇక తమకు శాశ్వతంగా సొంతింటి కల కల్లవుతుందనే ఆందోళన పేదల మనసుల్లో నెలకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది.
చేసిందంతా చేసి ఇప్పుడు టీడీపీ అరుపులు, పెడబొబ్బలు పెడుతోంది. అసలు పేదల ఇళ్ల స్థలాలపై కోర్టులో పిటిషన్ వేసిందే వైసీపీ కార్యకర్త అంటూ టీడీపీ కొత్త పల్లవి అందుకుంది. మరోవైపు కోర్టులో పిటిషన్లు వేసిన వాళ్లంతా ఇళ్ల పథకాల లబ్ధిదారులేనని, తమకు ఆ పిటిషన్లతో సంబంధం లేదని వారు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.
ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలాలను, ఇళ్లను అడ్డుకుంటూ, మరోవైపు గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సొంతింటి కలను చిదిమేసిన టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని పేదలు హెచ్చరిస్తున్నారు. దీంతో రాజకీయ కొంప కూలుతుందనే భయంతో టీడీపీ తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం.