ఆర్టీసీ చైర్మన్ గా ఇంకా వర్ల రామయ్యే ఉన్నారంటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఒకవైపు వీర తెలుగుదేశం పార్టీ నేతలా రియాక్ట్ అయిపోయి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడే ఈయన.. జగన్ సర్కారులో ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ నిష్టాగరిష్టుడికి.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు, తనబోటి వాళ్లు నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేయాలనే కనీస స్పృహ కూడా లేకపోవడం గమనార్హం.
వాస్తవానికి ఆర్టీసీ చైర్మన్ పదవీకాలమే ఏడాది అట. ఆ లెక్కన కూడా ఈయన పదవీకాలం ముగిసిపోయింది. అయినా.. ఈయన ఆ పదవినే పట్టుకుని వేలాడుతూ ఉండటం గమనార్హం. తన హోదాకు, జీతభత్యాలకూ ఆ పదవిని వాడుకొంటూ.. ఈయన చలామణి అయిపోతున్నారు. ప్రభుత్వం కూలిపోగానే రాజీనామా చేసి వెళ్లక, పదవీకాలం ముగిసినా దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ను వదలక.. ఈయన ఇంకా కొనసాగుతూనే ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వర్లకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ పదవి నుంచి ఇకనైనా గౌరవంగా తప్పుకోవాలని, లేకపోతే తప్పించాల్సి వస్తుందని వార్నింగ్ లెటర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈయన విషయంలో ఓపికగా చూస్తున్న ప్రభుత్వ తీరు కూడా ఆశ్చర్యకరమే.
వీర తెలుగుదేశం నేతలా వ్యవహరించే ఈయనను గౌరవంగా ప్రభుత్వమే ఆ హోదా నుంచి తప్పించేసి ఉండాల్సింది. అయితే ఎన్నో నీతులు చెప్పే వర్ల రామయ్య ఈ పదవిని పట్టుకుని ఇంకా వేలాడుతూ ఉంటూ.. తెలుగుదేశం వాళ్ల తీరెలా ఉంటుందో చాటి చెబుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.