చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం విద్యాసంస్థల బంద్‌కు సంబంధిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యాసంస్థలను మూసివేశారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును విద్యార్థులు, న్యాయవాదులు అడ్డగించారు. సీమకు న్యాయ రాజధానిపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సీమకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
తనను ప్రశ్నించడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. చెప్పులు చూపించాలని, కానీ తనకు సంస్కారం అడ్డొస్తోందని బాబు తీవ్ర వ్యాఖ్య చేశారు. అలాగే తాను రౌడీలకు రౌడీ, గూండాలకు గూండానంటూ రెచ్చిపోయారు. తాట, తోలు తీస్తానని ఆయన విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో సీమ ఆకాంక్షలను వెలబుచ్చిన వారిపై అవాకులు చెవాకులు పేలిన బాబు వైఖరిపై కర్నూలు జిల్లా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
బాబు సీమ వ్యతిరేక విధానాలను అవలంబించడంపై విద్యార్థులు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలనే తానే ప్రతిపాదించినట్టు చంద్రబాబు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. హైకోర్టు ఏర్పాటు చేయడానికి సీమ పనికి రాదా? అని నిలదీస్తున్నారు. రాజకీయ స్వార్థంతో చంద్రబాబు అమరావతి జపం చేస్తున్నారని మండిపడుతున్నారు.
రాయలసీమ వాసులను కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యవహరించిన బాబు వైఖరికి నిరసనగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యా సంస్థలను మూసివేసినట్టు వారు తెలిపారు.