సడెన్ గా కొత్త సినిమాను ప్రకటించడం, లాంఛింగ్ చేయడంతో పాటు టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కూడా ఒకేసారి రిలీజ్ చేశాడు నితిన్. అదే మాచర్ల నియోజకవర్గం. పైగా మాస్ట్రో విడుదలకు ముందే ఇలా చేయడంతో, 2 రోజుల పాటు ఈ కొత్త ప్రాజెక్టుపై చర్చ సాగింది.
తన కొత్త సినిమాపై నితిన్ మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మాచర్ల నియోజకవర్గాన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాగా చెప్పుకొచ్చిన నితిన్.. తన కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందంటున్నాడు.
“సినిమా కథ మొత్తం మాచర్ల చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ బేస్డ్ మూవీ కాబట్టి నియోజకవర్గం అనే పదం యాడ్ చేశాం. సినిమాలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి పాత్రలు ఉంటాయి. ప్రస్తుత రాజకీయాలకు, గతంలో జరిగిన పాలిటిక్స్ కు మా సినిమాతో సంబంధం ఉండదు. ఇది పూర్తిగా సినిమాటిక్ ఫిక్షన్ స్టోరీ. పవర్ పేట సినిమా కూడా పొలిటికల్ స్టోరీనే. కానీ దాన్ని ఆపేశాను. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల వదిలేయాల్సి వచ్చింది.”
ఇలా మాచర్ల నియోజకవర్గం సినిమాపై క్లారిటీ ఇస్తూనే, పవర్ పేట సినిమాను పక్కనపెట్టిన విషయాన్ని బయటపెట్టాడు నితిన్. ఇదే ఊపులో మరో చిన్న క్లారిటీ కూడా ఇచ్చాడు. మాస్ట్రో సినిమాలో తమన్న కంటే ముందు నయనతార పేరును పరిశీలించిన విషయాన్ని అంగీకరించాడు.
“తమన్నకు ముందు నయనతారను అనుకున్న మాట నిజమే. నయనతార కూడా ఒప్పుకుంది. చేస్తానని మాటిచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తమన్న కంటే నయనతార చేస్తే ఇంకా బాగుండేదనే కంపారిజన్ అనవసరం. ఎవరి స్టయిల్ వారిది. నయనతారను డిఫరెంట్ రోల్స్ లో చూశాం. తమన్నను ఫస్ట్ టైమ్ కొత్తగా చూడబోతున్నారు. తమన్న పాత్ర చాలా ఫ్రెష్ గా ఉంటుంది.”
ఇక తన పాత్రపై స్పందిస్తూ.. అంధుడిగా కనిపించడానికి ఎలాంటి హోం వర్క్ చేయలేదన్నాడు నితిన్. నిజానికి రంగ్ దే పనుల్లో బిజీగా ఉండడం వల్ల అంధ పాత్ర కోసం హోం వర్క్ చేయలేకపోయానని.. అంధాధూన్, రాజా ది గ్రేట్ సినిమాలు చూసి నేరుగా సెట్స్ పైకి వచ్చి నటించానని చెప్పుకొచ్చాడు.