తేలు కుట్టిన దొంగల్లా మీడియా సంస్థలు

కరోనా కేసు కొత్తగా నమోదైతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు, రాకపోకల్ని పూర్తిస్థాయిలో అడ్డుకుంటారు. ఏదైనా ఆఫీస్ లో ఉద్యోగి కరోనా బారిన పడితే.. కచ్చితంగా కార్యాలయాన్ని మూసేయాల్సిందే, మిగతా ఉద్యోగులను…

కరోనా కేసు కొత్తగా నమోదైతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు, రాకపోకల్ని పూర్తిస్థాయిలో అడ్డుకుంటారు. ఏదైనా ఆఫీస్ లో ఉద్యోగి కరోనా బారిన పడితే.. కచ్చితంగా కార్యాలయాన్ని మూసేయాల్సిందే, మిగతా ఉద్యోగులను క్వారంటైన్ కి పంపాల్సిందే. కానీ హైదరాబాద్ లో మీడియా సంస్థలు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి.

దాదాపుగా అన్ని ఆఫీసుల్లో కరోనా బాధితులున్నారని తేలింది. తెలివిగా వారిని హోమ్ క్వారంటైన్లో ఉండమని సూచిస్తున్న యాజమాన్యాలు, అసలు విషయాలు బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. మిగతా విషయాల్లో మీది పచ్చ బ్యాచ్, మీది బ్లూ బ్యాచ్ అంటూ విమర్శించుకునేవారు కూడా.. కరోనా దగ్గరికొచ్చే సరికి తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నాయి. గతంలో ఓ ఉద్యోగిని కోల్పోయిన మీడియా సంస్థలో ఇప్పుడు మళ్లీ కరోనా కలకలం రేగింది.

ఏకంగా 15మందికి పైగా కరోనా బారిన పడ్డారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ చైర్మన్ రూమ్ బయట ఉండే ఆఫీస్ బాయ్ కి కరోనా రావడంతో.. సదరు చైర్మన్, ఆఫీస్ కి మొహం చాటేసి ఇంట్లోనే ఉండిపోతున్నాడు. చీటికీ మాటికీ అయ్యగారి రూమ్ కి వెళ్లి భజన ప్రారంభించే ఓ బ్యాచ్ కూడా ఇప్పుడు తెగ ఫీలైపోతుందట. హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగి, మేకప్ మెన్, హెయిర్ డ్రస్సర్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, మరో ముగ్గురు టెక్నికల్ స్టాఫ్ ఇలా ఈ లిస్ట్ లో 15మంది వరకు ఉన్నారని స్టాఫ్ చెబుతున్నారు.

కేవలం ఈ ఛానెల్  లోనే కాదు, ఇంకో న్యూస్ ఛానెల్ లో ఏకంగా 22 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. మెరుగైన సమాజం కోసం ప్రయత్నించే మరో ఛానెల్ లో కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. కానీ అంతా గప్ చుప్. ఉద్యోగుల ఆక్రందనలు నాలుగు గోడలకే పరిమితమైపోతున్నయి. అందరిర గోడును టీవీల్లో చూపించే ఉద్యోగులకే ఇప్పుడు సమస్య వచ్చింది. యాజమాన్యాలు మాత్రం చూసీచూడనట్టు ఉంటున్నాయి.

లోకానికి నీతులు చెప్పే ఆ ఛానెల్ తన విషయానికొచ్చే సరికి ఎందుకంత సెల్ఫిష్ గా మారిపోయింది. రెవెన్యూ కోసం ఉద్యోగుల జీవితాలను ఎందుకు బలివ్వాలనుకుంటోంది. కనీసం కరోనా వచ్చినవారి వివరాలను ప్రభుత్వానికి ఎందుకివ్వడంలేదు, వచ్చినవారిని కూడా ఆస్పత్రులకు వెళ్లకుండా కేవలం హోమ్ క్వారంటైన్లోనే ఉండాలని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? ఇదంతా చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ టీవీ ఛానెళ్ల ఆఫీస్ లో కరోనా పుట్ట పగలబోతుందనే అర్థమవుతోంది. 

కల్నల్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ హోదా

ఏపీలో రేపటినుంచి కొత్త రాజకీయం