సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాలీవుడ్ లో ఓ బలమైన వర్గం హీరోహీరోయిన్లను వివక్షతో చూస్తుందనే అంశంపై భారీగా చర్చ నడుస్తోంది. నెపోటిజం టాపిక్ కూడా మరోసారి చర్చకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించింది హీరోయిన్ పాయల్ ఘోష్. సౌత్ ఇండస్ట్రీకి, బాలీవుడ్ కు ఉన్న స్పష్టమైన తేడాను మరోసారి వివరించింది.
“సౌత్ హీరోయిన్లు చాలా ఈజీగా దొరుకుతారనే చులకనభావం బాలీవుడ్ లో ఉంది. బాలీవుడ్ జనాలు నన్ను చాలా కించపరిచారు. నేను ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి లాంటి వాళ్లతో పనిచేశాను. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను, వాళ్లెవరూ నన్ను వాడుకోవాలని చూడలేదు. బాలీవుడ్ మాత్రం సౌత్ నటీనటులంటే చాలా చులకనగా చూస్తుంది”
సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్వర్గమని, అదే బాలీవుడ్ మాత్రం నరకమని అంటోంది పాయల్. బాలీవుడ్ ఆఫర్ల కోసం టాలీవుడ్ ను వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది.
“సౌత్ లో హీరోయిన్లకు గుళ్లు కడతారు. బాలీవుడ్ లో మాత్రం చనిపోయేలా కించపరుస్తారు. టాలీవుడ్ ను వదిలి చాలా తప్పు చేశాను. బాలీవుడ్ లో ఎవ్వరికీ ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. ఇది ప్రత్యక్ష నరకం.”
ఇలా బాలీవుడ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది పాయల్. హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటికే ఈ సుశాంత్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. సుశాంత్ ను బాలీవుడ్ పట్టించుకోలేదని ఆరోపించడమే కాకుండా.. గల్లీబాయ్ లాంటి సినిమాకు అవార్డులిస్తారు కానీ సుశాంత్ నటించిన చిచోరే లాంటి సినిమాలను ఎందుకు మెచ్చుకోరంటూ ప్రశ్నించింది.
బాలీవుడ్ లో హీరోహీరోయిన్ల పట్ల వివక్ష ఎక్కువగా ఉందని ఆరోపిస్తోంది ఓ వర్గం. పెద్ద కుటుంబం నుంచి లేదా ఉన్నత వర్గం నుంచి వచ్చిన నటీనటులకు ఒక రకమైన ట్రీట్ మెంట్ ఉంటుందని.. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన ఆర్టిస్టులకు మరో రకమైన ట్రీట్ మెంట్ అందుతుందంటూ ఉదాహరణలు కూడా చెబుతున్నారు.