ఒకప్పుడు లేనిది, కొత్తగా వచ్చి పడిందీ ఏదన్నా వుంటే మనోభావాల వ్యవహారం. సర్దార్ పాపారాయుడు సినిమా తీసినపుడు లేదు. బొబ్బిలి పులి అన్నపుడు లేదు. ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య అన్నపుడు లేదు టాటా బిర్లా మధ్యలో లైలా అన్నా లేదు. కానీ ఇప్పుడు ఏ టైటిల్ పెట్టాలన్నా, ఎవరి మనో భావాలు దెబ్బతినేస్తాయో అన్న భయం వెన్నాడుతూ వుంటుంది. ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనోభావాలు దెబ్బతినేస్తాయి.
లేటెస్ట్ గా సినిమాలకే పరిమితం అయిన ఈ మనోభావాల సమస్య ఓటిటి లకు కూడా చుట్టుకునేలా వుంది. భానుమతి రామకృష్ణ అనే వెబ్ ఫిల్మ్ జూలై 3న ఆహా లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ టైటిల్ పట్ల అలనాటి హీరోయిన్ భానుమతి ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందట. అప్పటికీ ఇందులో భానుమతిగారిని కించపరిచే అంశాలు కానీ, ఆమె ను గుర్తుకు చేసే విషయాలు కానీ ఏమీ లేవు అని, టైటిల్ మినహా మరే సంబంధం లేదని సినిమా మేకర్లు క్లారిటీగా చెప్పారట.
కావాలంటే సినిమా కూడా చూడమన్నారు. దాంతో ఊరుకున్నారు. కానీ తీరా సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తోందని తెలిసాక, తాము ఒప్పుకొమని, కోర్టుకు వెళ్తామని భానుమతి కుమారుడు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ నిర్మాతలకు ఓ ఊరట ఏమిటంటే, ఇది ఏ కమ్యూనిటీకి, రెలిజియన్ కు సంబంధించినది కాదు. మాస్ హడావుడి, గొడవలు పెట్టేంత వ్యవహారం కాదు. జస్ట్ ఓ ఫ్యామిలీకి సంబందించినది.
అందువల్ల అవసరం అయితే కోర్టులో చూసుకుందామని, ఆన్ లైన్ లో వెబ్ మూవీ విడుదల మాత్రం ఆపేది లేదని, ఆహా లీగల్ టీమ్ ప్రిపేర్ అయిపోతోందట. అయినా చిరంజీవి, నాగార్జున, వాణిశ్రీ, శ్రేదేవి ఇక ఇలా కాస్త పాపులర్ అయిన పేర్లు ఏవీ ఇక సినిమాలకు, వెబ్ సిరీస్ కు ఇక వాడకూడదన్నది ఓ రాజ్యంగ నియమం అయిపోతుందో ఏమిటో?