ఏజెన్సీలోనే సహజ సిద్ధమైన వనరులు లభిస్తాయి. అక్కడ పండే పంటలకే యావత్తు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అయితే వాటికి తగిన ప్రోత్సాహం ఇన్నాళ్ళు కరవు అయింది. అరకు కాఫీ విషయమే తీసుకుంటే దానికి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ సంగతి తెలియక గిరిజనులు వేరే ఇతర పంటల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు.
ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఐటీడీయే కూడా గిరిజన రైతులకు అవసరమైన సలహా సూచనలు ఇవ్వడంతో ఇపుడు అరకు లో కాఫీ సాగు పెద్ద ఎత్తున సాగుతోంది. విశాఖ ఏజెన్సీలో ఏకంగా లక్షా యాభై వేల ఎకరాలలో కాఫీ సాగు పెంచుతున్నారంటే ఆశ్చర్యమే కలుగుతుంది. మొత్తం పదకొండు మండలాల గిరిజన రైతాంగానికి ఇది లాభాలను కూడా తెచ్చిపెట్టే వ్యాపార సాగుగా మారింది.
దీని మీద ఐటీడీఏ తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఇక మీదట రెండు లక్షల దాకా ఎకరాలలో కాఫీ సాగు జరుగుతుందని అంటున్నారు. దాని కోసం పాతిక కోట్లకు పైగా నిధులను వెచ్చిస్తున్నట్లుగా ఐటీడీఏ అధికారులు తెలిపారు.
అలాగే గిరిజన కాఫీ రైతులకు బేబీ పల్పర్ యంత్రాలను కూడా 1500 దాకా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి అరకు కాఫీ ఇక అంతర్జాతీయ కాఫీగా మారిపోయింది అన్న మాట. గ్లోబ్ మొత్తం మీద ఎక్కడ తిరిగినా కూడా అరకు కాఫీ రుచిని ఆస్వాదించడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.