మద్యం దారుణాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి మద్యానికి బానిసవ్వడంతో ఆంధ్రాలో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటు తెలంగాణలో మద్యం మత్తులో భార్యను గొడ్డలితో కొట్టిన ఘటన కూడా చూశాం. ఇది అంతకంటే దారుణమైన ఘటన. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని, కన్నతల్లిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. వికారాబాద్ లో జరిగింది ఈ ఘటన.
జిల్లాలోని బొమ్మార్స్ పేట్ మండలం దుద్యాలలో అశోక్ నిర్మాణ పనులు చేస్తుంటాడు. లాక్ డౌన్ వల్ల మద్యం దుకాణాలు తెరవని రోజుల్లో బాగానే ఉన్నాడు. దొరికినప్పుడు తాగాడు, లేనప్పుడు ఇంట్లోనే తిని పడుకునేవాడు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారికంగా దుకాణాలు తెరిచిందో, అప్పట్నుంచి అశోక్ మళ్లీ తాగుడుకు అలవాటుపడ్డాడు.
ఈ క్రమంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు కావాలని తల్లి అంజిలమ్మని అడిగాడు. కానీ ఆమె డబ్బులు ఇవ్వలేదు. కొడుకును ఎలాగైనా మద్యానికి దూరం చేయాలనే భావనతో ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్.. తల్లిని గొంతు నులిమి చంపేశాడు.
స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యానికి బానిసైన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. అశోక్ భార్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.