విశాఖపట్నం-చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ఏర్పాటు చేయ తలపెట్టిన విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్‌ఐసీడీఐటీ) ఇంకా ఆమోదం తెలపలేదని శుక్రవారం రాజ్యసభలో పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. అందువలన ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఎలాంటి నిధుల కేటాయింపు కూడా జరగలేదని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెబుతూ విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం, మచిలీపట్నం, చిత్తూరు, దొనకొండలను అభివృద్ధి కేంద్రాలుగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) గుర్తించినట్లు మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పనుల కోసం ఏడీబీ ఇప్పటి వరకు 63.1 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
అయితే ఈ నాలుగు కేంద్రాలలో ముందుగా విశాఖపట్నం, చిత్తూరును ప్రాధాన్యంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఏడీబీ ఆర్థిక సహాయంతో నాయుడుపేటలో నీటి శుద్ధి కేంద్రాన్ని, పారిశ్రామిక ప్రాంతాన్ని మెరుగుపరచే చర్యలు చేపట్టింది. అలాగే బల్క్ వాటర్ సప్లై, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్మాణం జరుగుతోంది. సామర్లకోట-రాజానగరం రోడ్డు నిర్మాణం జరుగుతోంది. విశాఖపట్నం, చిత్తూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ల సామర్ధ్యం పెంచే పనులు జరుగుతున్నాయి. నాయుడుపేట, రౌతుసురమాలలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నట్లు మంత్రి గోయల్ తెలిపారు.
విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ముందుగా విశాపట్నం-చిత్తూరు కేంద్రాలను అభివృద్ధిచేసే అంశాన్ని చేర్చాలని కోరుతూ 2019 అక్టోబర్‌లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌ఐసీడీఐటీని కోరిందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇంజనీరింగ్ పనుల చేపట్టి మౌలిక వసతుల కల్పన కింద వివిధ అంశాలకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధి చేసే దశలోనే ఉన్నందున ఎప్పటికి పూర్తవుతందన్న అంచనా లేదని తెలిపారు. ఏడీబీ రూపొందించిన కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్ కారిడార్ కోసం విశాఖపట్నంలో 6629 ఎకరాలు, మచిలీపట్నంలో 15543 ఎకరాలు, దొనకొండలో 17117 ఎకరాలు, చిత్తూరులో 26731 ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నట్లు మంత్రి తెలిపారు.
విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా ముందుగా విశాఖపట్నం, చిత్తూరు కేంద్రాల అభివృద్ధి కోసం మొత్తం 31515 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4891 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. ఇక చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణపట్నం, తమిళనాడులోని పొన్నేరి, కర్నాటకలోని తుమకూరు కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి గోయల్ వెల్లడించారు.
దీని కోసం కృష్ణపట్నంలో 14 వేల ఎకరాలు, పొన్నేరిలో 21966 ఎకరాలు, తుమకూరులో 9630 ఎకరాలు అవసరమని గుర్తించడం జరిగింది. కృష్ణపట్నం కేంద్రానికి సంబంధించి సవివరమైన మాస్టర్ ప్లాన్ పూర్తయింది. ఇందులో 2500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన మౌలిక వసతులకు ఇంజనీరింగ్ ప్రణాళిక సిద్ధమైంది. కృష్ణపట్నం ప్రాజెక్ట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు కూడా జరిగింది. ఇందులో ఎన్‌ఐసీడీఐటీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమాన వాటా కలిగి ఉంటాయని మంత్రి చెప్పారు.