గణేశ్ మండపానికి ఎక్కువ, కోళ్ల షెడ్డుకు తక్కువ! అని ట్వీట్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. కూల్చేసిన ప్రజావేదిక గురించి సోషల్ మీడియాలో ఈ మేరకు టాక్ వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తీరుపై ధ్వజమెత్తుతూ వివిధ అంశాలపై ఆయన ఇలా ట్వీట్ చేశారు.
''చంద్రబాబు ప్రభుత్వం 9 కోట్లు బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. గణేశ్ మండపానికి ఎక్కువ, కోళ్ల షెడ్డుకు తక్కువని సోషల్ మీడియాలో యువత చెణుకులు విసురుతోంది. దాన్నికూల్చడం అనొద్దట. ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట.
అనుకూల మీడియా మళ్లీ చంద్రబాబు పల్లకి సేవ మొదలు పెట్టింది. నదీ పరిరక్షణ చట్టం-1884, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయి. మీడియా కూడా ఈ చట్టాలు చదవాలి. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమో.
తమ అధినేత అవినీతిని సమర్థించడం మినహా కళా వెంకట్రావు చేయగలిగిందేముంది. సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు అధికారులు వేసిన అంచనాల ప్రకారం విద్యుత్తు కొనుగోళ్లపై అదనంగా 2,636 కోట్ల చెల్లింపులు జరిగాయని వెల్లడైంది. ప్రజాధనం లూటీ చేసినవారు ఆ మొత్తాలను కక్కక తప్పదు.''