పార్టీ వీడే నేతల విషయంలో కూడా కులం వారీగా ఆపరేషన్ చేపట్టారట చంద్రబాబు నాయుడు! అందుకోసమని పార్టీలోని కాపు నేతలందరితోనూ ఆయన సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారట! అయినా ఒక పార్టీలోని నేతలను ఇలా కులాల వారీగా విభజించుకుని.. వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండటం గమనార్హం.
ఆఖరికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా తయారైనట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. బహుశా ఒక పార్టీలోనే అలా నేతలను కులాలవారీగా విభజించి వారితో సమావేశాలు ఏర్పాటు చేసేనేత ఎవరూ ఉండకపోవచ్చని.. అది చంద్రబాబుకే సాధ్యం అవుతోందనే కామెంట్ కూడా వినిపిస్తూ ఉంది.
ఇప్పటికే ఒకసారి తన పార్టీలోని కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దానికి నేతలు డుమ్మాకొట్టడంతో జూలై ఒకటో తేదీన మళ్లీ సమావేశాన్ని నిర్వహించాలని డిసైడ్ చేశారట. ఆ రోజున కాపు నేతలంతా రావాలని చంద్రబాబు నాయుడు పిలిచారట.
ఆ సమావేశానికి ఎవరు హాజరవుతారు, ఎవరు హాజరుకారు.. అనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. అయితే తెలుగుదేశం పార్టీని వీడుతున్న నేతలను ఇలా కులాల వారీగా వేరు చేసి చూస్తూ ఉండటం విడ్డూరంగా మారింది. ఇప్పటికే టీడీపీని వీడిన నేతల్లో కాపులు ఎంతమంది అనేది అందరికీ తెలిసిందే!
చంద్రబాబుకు అతి సన్నిహిత కమ్మనేత సుజనాచౌదరి ఇప్పటికే ఫిరాయించారు. ఇక సీఎం రమేశ్, టీజీలు కూడా కాపులు ఏమీకాదు. త్వరలోనే పార్టీని వీడబోతున్న వరదాపురం సూరి, పరిటాల లాంటి కమ్మలు, అదే జాబితాలో ఉంటారనే అంచనాలతో ఉన్న జేసీ, కోట్ల వండి రెడ్లు, కేఈ వంటి బీసీ నేతలున్నారు.
అయితే కాపుల మీదే చంద్రబాబు నాయుడు ఎక్కువగా అనుమానాలు వ్యక్తంచేస్తూ వారితోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉండటం విడ్డూరమే. అయితే కాపునేతలు ఇంకా తెలుగుదేశంలో ఉన్నారేమో కానీ.. ఓటర్లు మాత్రం ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చాలా దూరం అయ్యారు. ఆ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని పరిశీలకులు అంటున్నారు.