ఇరవై మూడు మందిలో రెండూ బై మూడోవంతు ఎమ్మెల్యేలు అంటే.. దాదాపుగా పదహారు మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుకు రెడీ కావాలి. అంతమంది తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతాపార్టీలోకి చేరితే వారిపై అనర్హత వేటుకు దాదాపుగా అవకాశం ఉండదు.
అలా కాకుండా.. తక్కువ మంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం అప్పుడు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీ అవుతుంది. ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్యే పేరు తెరమీదకు వచ్చింది. అయితే తను పార్టీ మారాలని అనుకోవడం లేదని ఆయన అంటున్నాడు. వ్యక్తిగత పనుల మీదే ఢిల్లీలో ఉన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఫిరాయింపు ఎంపీ ఇంటికి ఆయన వెళ్లడంతో ఆయన కూడా ఫిరాయిస్తాడనే ప్రచారం ఊపందుకుంటోంది.
సదరు ఎమ్మెల్యే మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ.. ఇదివరకటి ఫిరాయింపు రాజకీయాలను గమనించినా ఇవన్నీ ఫిరాయింపుకు ప్రిపరేషన్లు అనేమాట వినిపిస్తూ ఉంది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే బీజేపీ సాధించేది ఏమీ ఉండదు. అలాంటి వారిపై అనర్హత వేటు కచ్చితంగా పడితీరుతుంది.
ఎలాగూ అలాంటి వారు బీజేపీ తరఫున పోటీచేసి నెగ్గే అవకాశం ఉండదు. పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యనే ఉంటుంది. కాబట్టి.. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం విషయంలో కమలం పార్టీ తర్జనభర్జనలు పడుతోందని సమాచారం.