వెక్కిరించుకుంటున్న టీడీపీ, బీజేపీ!

'మా పార్టీలోకి చేరగానే వాళ్లు అపవిత్రులు అయ్యారా..' అంటూ ప్ర్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 'మీ పార్టీలోకి చేరగానే వారు పవిత్రులు అయ్యారా..' అంటూ బీజేపీ విషయంలో వ్యాఖ్యానిస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఫిరాయించిన నలుగురు…

'మా పార్టీలోకి చేరగానే వాళ్లు అపవిత్రులు అయ్యారా..' అంటూ ప్ర్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 'మీ పార్టీలోకి చేరగానే వారు పవిత్రులు అయ్యారా..' అంటూ బీజేపీ విషయంలో వ్యాఖ్యానిస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యుల విషయంలో ఇలా బీజేపీ, టీడీపీల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.

ఫిరాయించిన నలుగురూ అవినీతి పరులు, బ్యాంకులకు కన్నాలు వేశారు అని ఇప్పుడు టీడీపీ వాళ్లు అంటున్నారు. వాళ్లకు నైతికత లేదని, వాళ్ల పై కేసులు ఉన్నాయని, అందుకే వారు బీజేపీలోకి జంప్ చేశారని టీడీపీ వాదిస్తూ ఉంది. మొన్నటి వరకూ వాళ్లు చంద్రబాబుకు అతి సన్నిహితంగా మెగిలిన నేతలు అనే అంశాన్ని మరిచిపోయినట్టుగా టీడీపీ వాళ్లు  మాట్లాడుతూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పై విషయాలను గుర్తు చేస్తూ ఉంది. 'మొన్నటి వరకూ మీ పార్టీలో ఉన్నప్పుడు వారి విషయంలో ఇవన్నీ గుర్తుకు రాలేదా?' అని బీజేపీ నేతలు టీడీపీని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు టీడీపీలో ఉన్నంత సేపూ మంచి వాళ్లే అయ్యారు, ఇప్పుడు బీజేపీలోకి చేరగానే చెడ్డ వాళ్లు అయ్యారా.. అని కమలనాథులు ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఇక నైతికత, ఫిరాయింపుల విషయంలో విలువలు వంటి అంశాల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా? అని బీజేపీ వాళ్లు మరో ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇలా ఒకర్నొకరు వెక్కరించుకుంటున్నారు ఇరు పార్టీల వాళ్లూ. అయితే వీళ్ల వాదనలను వింటూ.. ప్రజలు అనుకుంటున్నది మాత్రమే ఒకటే. 'దొందూ.. దొందే' అని వీరి తీరును గమనించాకా సామాన్య ప్రజలు అనుకుంటున్నారు!

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా