వీలైనంతగా తండ్రి పేరును ప్రభుత్వ పథకాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో జొప్పించేందుకే ప్రాధాన్యతను ఇస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఇది వరకూ పలు పథకాలకు పెట్టారు. అధికారంలోకి రాగానే 'ఆరోగ్య శ్రీ' విషయంలో వైఎస్ పేరును పెట్టారు.
ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభం అయిన పథకం అనేది అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు తనకు అధికారం దక్కగానే ఆ పథకం పేరు మార్చేశారు. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. 'రాజీవ్ ఆరోగ్య శ్రీ'ని ఎన్టీఆర్ వైద్యసేవ'గా మార్చారు చంద్రబాబు. సొంతంగా ఆలోచించలేకపోయినా.. అలా పాత పథకానికి పేరు మార్చారు చంద్రబాబు.
ఇక జగన్ అధికారంలోకి రాగానే ఆ పథకానికి ఎన్టీఆర్ పేరు తొలగించి 'డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ'గా ఆ పథకాన్ని మార్చారు. ఈ క్రమంలో ఇతర సంక్షేమ పథకాల్లో కూడా కొన్నింటికి పేర్లను మార్చారు. ఇలాంటి నేపథ్యంలో.. మరో నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఏపీలో రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలైన ఎనిమిదో తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆ రోజును రైతు దినోత్సవంగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. అదే రోజున పలు సంక్షేమ పథకాల అమలుకు కూడా శ్రీకారం చుట్టనున్నారని సమాచారం.