కేసీఆర్‌ నీటి లెక్కలపై జర జాగ్రత్త జగన్‌.!

తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా నీటిని అందించే ముఖ్యమైన నదులు కృష్ణా, గోదావరి. ఈ రెండు నదులూ ఎగువనున్న రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన…

తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా నీటిని అందించే ముఖ్యమైన నదులు కృష్ణా, గోదావరి. ఈ రెండు నదులూ ఎగువనున్న రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా కన్పిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రంగా తయారైతే, అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటిగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది. కేంద్రం సాయం అవసరం లేకుండా తెలంగాణ రాష్ట్రం, అత్యంత క్లిష్టమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మించుకుంది. దానికి ప్రారంభోత్సవం కూడా ఫిక్స్‌ అయ్యింది. 

కానీ, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అందుకు బిన్నం. కేంద్రం వైపు 'దేహీ' అని చూడాల్సిన దుస్థితిలో వుంది ఆంధ్రప్రదేశ్‌. కేంద్రమేమో, పోలవరం ప్రాజెక్ట్‌కి నానా రకాల కొర్రీలూ పెడ్తోంది. ఖర్చుతో పోల్చితే, పోలవరం కంటే కాళేశ్వరమే పెద్దది. కానీ, ప్రయోజనాల విషయంలో పోలవరం ది బెస్ట్‌ ప్రాజెక్ట్‌. ఏం లాభం.? అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. నిజానికి పోలవరం ప్రాజెక్ట్‌కి గత ఐదేళ్ళలో అడ్డుతగిలిన 'శకునాల్లో' తెలంగాణ వాటా తక్కువేమీ కాదు. 

ఇప్పుడంటే జగన్‌ మీద ప్రేమతో పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం 'అభ్యంతరాలు' లేనట్టు పైకి కన్పిస్తున్నా, ఆ ప్రభుత్వం తరఫున.. ఇప్పటికీ కొన్ని కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే వున్నాయి మరి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళడం ఎంతవరకు సబబు.? తన అవసరాల కోసం ఎలాగైనా ప్లేటు ఫిరాయించగల నైజం కేసీఆర్‌ది. 

బచావత్‌ ట్రైబ్యునల్‌ లెక్కల ప్రకారం, ఎగురవ రాష్ట్రాలతోపాటు, దిగువ రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులకు అదనంగా, చిట్ట చివరి రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయే జలాల్ని ఒడుపుగా వాడుకోగలిగితే వాటిని వాడుకునేందుకు వీలుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత చిట్ట చివరి రాష్ట్రం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌. కానీ, కేసీఆర్‌ మాత్రం.. ఆ చిట్ట చివరి నీళ్ళపై కన్నేశారు.. అందులో వాటాని ఆశిస్తున్నారాయన. తన మనసులో మాటని కేసీఆర్‌ తాజాగా బయటపెట్టారు కూడా. 

వరదలొచ్చినప్పుడు చిట్ట చివరి రాష్ట్రమే నష్టపోతుంది గనుక.. సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకునేందుకు ఆ చివరి రాష్ట్రానికే వెసులుబాటు వుంటుందిగానీ.. దానిపైనున్న రాష్ట్రానికి వాటా ఎలా వుంటుంది.? ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి స్పష్టత తెచ్చుకోవాల్సి వుంది. లేకపోతే.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కి భారీ నష్టం తప్పకపోవచ్చు.