హాస్యం.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడటమా.?

కాంగ్రెస్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టింది గనుక.. విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ పాలనలో న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ – టీడీపీలకు పట్టం కట్టారన్నది జగమెరిగిన…

కాంగ్రెస్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టింది గనుక.. విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ పాలనలో న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ – టీడీపీలకు పట్టం కట్టారన్నది జగమెరిగిన సత్యం. కానీ, బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళలో అన్యాయమే చెయ్యడం.. అంతకు ముందు ఏపీకి అన్యాయం చేసినక కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం.. వెరసి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఒళ్ళు మండి.. టీడీపీతోపాటు, బీజేపీకీ చుక్కలు చూపించేశారు. ఇదీ వాస్తవం. 

నిజాలు అంత తేలిగ్గా బీజేపీకి నచ్చవు. చంద్రబాబు సంగతి సరే సరి. కాంగ్రెస్‌తో అంటకాగడం వల్లే తమకు ఈ ఫలితాలని చంద్రబాబు ఇకముందైనా గుర్తిస్తారో లేదోగానీ.. ఇప్పటికైతే మాత్రం టీడీపీ ఓటమికి కారణాలు తెలియడం లేదంటూ పైకి మాత్రం బుకాయింపుల పర్వం కొనసాగిస్తూనే వున్నారు. మరోపక్క, బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతమయ్యేందుకు స్కెచ్‌ రెడీ చేస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళలేని నేతల్ని, తమతో కలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 

కామెడీకే పరాకాష్ట ఇది. కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చిన చాలామంది సీనియర్‌ నేతలు, బీజేపీలో గతంలోనే చేరిపోయారు. పురంధరీశ్వరి, కావూరి సాంబశివరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలా పెద్దదే. కానీ, వాళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కనీసపాటి ఓటు బ్యాంకు కూడా తీసుకురాలేకపోయారు సరికదా.. బీజేపీ తాజా ఎన్నికల్లో ఆ కాస్త ఓటు బ్యాంకునీ కోల్పోయిందాయె. ఇప్పుడు కొత్తగా టీడీపీ నేతల్ని చేర్చుకుని, బీజేపీ బలపడాలన్న ఆలోచన చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. 

అన్నట్టు, ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బీజేపీ గట్టిగానే కెలుకుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బీజేపీకి ఆత్మహత్యా సదృశ్యమే మరి. ఇకపై బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో తిరగకూడని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఓటుతో బీజేపీకి గుణపాఠం చెప్పారు. అయినా, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతోంటే, పరిస్థితులు చెయ్యిదాటకుండా ఎలా వుంటాయ్‌.? 

తాజా ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం అత్యంత దారుణం. అంతలా రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన పార్టీలోకి టీడీపీ నేతలైనా ఏ మొహం పెట్టుకుని వెళతారు.? బతిమాలుకునో, బామాలుకునో వైసీపీలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి కాస్తో కూస్తో రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయేమో.! బీజేపీలోకి వెళితే.. భవిష్యత్‌ ప్రశ్నార్థకమన్న కనీస ఇంగితం లేని నేతలే బీజేపీ వైపు చూస్తున్నారంటే.. అది తప్పెలా అవుతుంది..