ఏపీకి ప్రత్యేకహోదా సాధించే దిశగా ముఖ్యమంత్రి జగన్ తొలి అడుగు వేశారు. అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల్లోనే హోదా కావాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలాంటి ప్యాకేజీలు అక్కర్లేదని, హోదా మాత్రమే కావాలని గట్టిగా చెప్పారు.
“మరోసారి ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం పెడుతున్నామంటే, గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పెట్టారు. అయ్యా.. మాకు అలాంటి ప్యాకేజీ వద్దు, ప్రత్యేకహోదానే కావాలంటూ మరోసారి తెలియజెప్పేందుకు ఈ తీర్మానం చేస్తున్నాం. ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దకపోగా మరింత అన్యాయం జరిగింది. అందుకే ఇప్పుడు ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది.”
ఈ సందర్భంగా ప్రత్యేకహోదాపై ఉన్న అపోహల్ని తొలిగించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దంటూ 14వ ఆర్థిక సంఘం సిఫార్స్ చేసిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు జగన్. దానికి సంబంధించిన ఆర్థికసంఘం కాపీల్ని కూడా సభ ముందు ఉంచి అనుమానాల్ని నివృత్తిచేశారు.
“14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే హోదా ఇవ్వడం లేదనే వాదనలు వినిపించాయి. ఈ వాదనలన్నీ సత్యదూరం. నిజం ఏంటనేది మరోసారి అందరి ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నేరుగా సభ ముందు ఉంచుతున్నాను. ఈ కాపీని అందరికీ పంచుతున్నాం. ప్రత్యేక హోదా రద్దుకు సిఫార్స్ చేయలేదని ఆయన లేఖలో స్పష్టంగా రాసుకొచ్చారు.”
హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించి, ఆ హామీని నిలబెట్టుకోని ఆ పార్లమెంట్ కు రాష్ట్రాన్ని విభజించడం న్యాయమేనా అని సూటిగా ప్రశ్నించారు జగన్. ప్రత్యేకహోదానే రాష్ట్రానికి జీవనాడి అవుతుందని, హోదా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల మంది ప్రజల తరఫున తీర్మానం చేస్తూన్నామంటూ ప్రకటించారు.
ప్రత్యేకహోదాపై చర్చలో భాగంగా మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాష్ట్రానికి హోదా తీసుకురాలేకపోయామని అంగీకరించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన బాబు.. హోదా తీసుకొచ్చే బాధ్యతను ప్రజలు జగన్ కు ఇచ్చారని అన్నారు. ఐదేళ్లలో హోదా కోసం చాలా ప్రయత్నించామని కానీ తమ వల్ల కాలేదని స్పష్టంచేశారు.
టీడీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత జగన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే తీర్మానాన్ని మొన్న జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో కూడా జగన్ చదివి వినిపించారు. ఇప్పుడు ఇదే తీర్మానం కాపీని కేంద్రానికి పంపించబోతున్నారు.