గత అసెంబ్లీలో వైసీపీ నేతలపై తీవ్రంగా మాటల దాడి చేసేవారు టీడీపీ నేతలు. ముఖ్యంగా అచ్చన్నాయుడు నోటికి తిరుగే లేకుండా ఉండేది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పక్షపాత వైఖరితో ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా చేశారు. అదే టైమ్ లో అచ్చెన్నాయుడు రెచ్చిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అచ్చెన్నాయుడికి ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఒక దశలో అచ్చెన్న ఓవర్ యాక్షన్ పై సాక్షాత్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా ఫైర్ అయ్యారు. డోంట్ డిక్టేట్ ది చైర్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు చివరిరోజు సమావేశమైన అసెంబ్లీలో ప్రత్యేకహోదా అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న టైమ్ లో మాటి మాటికి అడ్డు తగులుతున్నారు అచ్చెన్నాయుడు. స్పీకర్ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో.. జగన్ వైపు చూస్తూ.. మీరైనా స్పీకర్ కి చెప్పండి అన్నారు. దీంతో స్పీకర్ తమ్మినేనికి కోపం కట్టలుతెంచుకుంది.
స్పీకర్ స్థానంపై దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, తనను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం అస్సలు చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ గా తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఎవరో చెబితే మాట్లాడనిచ్చే మనిషిని కాదని అచ్చెన్నాయుడిని మందలించారు. ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలని, బెదిరింపు ధోరణి మంచిది కాదని హితవు పలికారు. దెబ్బకు అచ్చెన్నాయుడు సైలెంట్ అయ్యారు.
అచ్చెన్నాయుడు, తమ్మినేని సీతారాం ఇద్దరూ శ్రీకాకుళం జిల్లావారే. టీడీపీలో కలసి పనిచేశారు కూడా. ఆ తర్వాత ఎవరి దారి వారిది అయింది. అయితే జిల్లాలో మాత్రం ఎప్పుడూ అచ్చెన్నదే పైచేయి. జిల్లా రాజకీయాల్లో ఇతరుల డామినేషన్ ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు అచ్చెన్నాయుడు. పోయినసారి అధికార పార్టీ నేతగా, మంత్రిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించారు.
కానీ ఇప్పుడు కాలంమారింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్న వాయిస్ పడిపోయింది. అదే జిల్లా నుంచి వచ్చిన తమ్మినేని సీతారాం సభాధ్యక్షుడిగా అత్యంత గౌరవప్రదమైన పదవి అందుకున్నారు. గతంలోలా సీతారాంపై విరుచుకుపడిపోవచ్చనే ధోరణిలో అచ్చెన్నాయుడు ఉన్నారు. కానీ సభాధ్యక్ష స్థానంలో ఉన్న తనపై నోరుపారేసుకుంటే మంచిదికాదని కాస్త గట్టిగానే చురకలు అంటించారు సీతారాం.
ఒక్క అచ్చెన్నాయుడికే కాదు, మిగతా టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ మేరకు పరోక్షంగా సీతారాం గట్టి కౌంటర్ ఇచ్చినట్టయింది. తొలి సెషన్లోనే ఇలాంటి వ్యవహారాలకు చెక్ చెప్పాలని సీతారాం గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ విషయం పక్కనపెడితే.. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు కీలకనేతల పదవుల్లో, వైఖరుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడండంటూ సభలో చర్చించుకున్నారు చాలామంది.