ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినమాట తప్పినందుకు… ఆ విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా గుర్తించినందుకు… ఇక ఈ రాష్ట్రానికి రావడానికి ప్రధాని నరేంద్రమోదీకి మొహం చెల్లని పరిస్థితి ఏర్పడింది. ఏపీ టూరు ఏర్పాటు చేసుకోవడమూ వాయిదా వేసుకోవడమూ జరిగాయి. ఎన్నికల ప్రచారాన్ని మినహాయిస్తే ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయన ఏపీకి వస్తున్నారు. ఈనెల 9వ తేదీన తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి మోదీ రానున్నట్లు కార్యక్రమం ఖరారైంది. అయితే ఎక్కడినుంచి అయితే ఏపీ ప్రజలకు ప్రత్యేకహోదా గురించి తాను మాట ఇచ్చాడో… అదే తిరుమల వెంకన్న పాదసన్నిధి నుంచి ఆయన పాపప్రక్షాళన చేసుకుంటారా? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.
చంద్రబాబునాయుడు ఎన్డీయే చంకలో ఎక్కి ఉన్నంత వరకూ మోడీ భజన బాగానే చేశారు. ప్యాకేజీ విషయంలో తన డిమాండ్లకు కేంద్రం నో చెప్పిన తర్వాత.. బయటకు వచ్చి రాళ్లేయడం మొదలెట్టారు. చంద్రబాబు స్వార్థ, సంకుచిత ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ… మొత్తానికి రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా.. హోదా విషయంలో మోదీ చేసిన మోసం ప్రజలందరికీ అర్థమైంది. ఆ పాపంలో చంద్రబాబుకు కూడా స్పష్టమైన భాగం ఉన్నది గనుకనే ప్రజలు ఆయనను ఎన్నికల్లో తిరస్కరించారు.
ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కూడా.. మోదీ ఏపీకి రావడానికి ప్రయత్నించారు. ఏమైనా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలున్నాయా? అని వాకబు చేస్తే.. ఏపీలో అలాంటివేమీ లేవని గతంలో జవాబు వెళ్లింది. ఆయనంతగా ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకుని, షెడ్యూలు అయిన తర్వాత కూడా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఏపీ వైపు ఆయన చూడలేదు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాత్రమే ఏదో మొక్కుబడిగా రాష్ట్రంలో కూడా అడుగుపెట్టి వెళ్లారు.
చంద్రబాబునాయుడు సున్నం పెట్టుకున్న తరవాత, హోదా విషయంలో మోసం బట్టబయలైన తర్వాత.. సాధారణ కార్యక్రమం కింద రాష్ట్రానికి రావడం ఇదే మొదలు. పైగా ఎక్కడినుంచైతే ఏపీకి పదేళ్లు హోదా ఇస్తాం అని మోడీ హామీ ఇచ్చారో.. అదే తిరుపతికి వస్తున్నారు. మరి మాట తప్పినందుకు పాపప్రక్షాళనం చేసుకునేలా.. ఏపీకి మోడీ ఏమైనా కొత్త వరాలు ప్రకటిస్తారా? అనే చర్చ ఇప్పుడు పలువురిలో జరుగుతోంది. తనను నానారకాలుగా నిందించిన చంద్రబాబును దారుణంగా ఓడించినందుకైనా.. ఏపీ ప్రజలకు కృతజ్ఞత పూర్వకంగా మోదీ కొత్త వరాలు ప్రకటించాలని ప్రజలు ఆశిస్తున్నారు.
పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం