సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత… రాహుల్ కు ‘కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి’ అనే హోదా శాశ్వతంగా మారిపోతుందేమో అనే అభిప్రాయం పలువురికి కలిగింది. ఇప్పటికే సుమారు రెండు దశాబ్దాలుగా.. ఆయన ‘కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థి’ అనే డిజిగ్నేషన్ ను భుజాన మోసుకుంటూ తిరుగుతున్నారు. అంతే తప్ప పదవి ఆయనను వరించడం లేదు. అలాంటి రాహుల్ లో ఇప్పుడు పలాయనవాదం ప్రబలిందా? వైరాగ్యం ముదిరిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మోదీ ఘనమైన విజయాన్ని సాధించి రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించిన వేళ… ఆ స్థానానికి తనను మించిన ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా పోటీపడిన రాహుల్… తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. కాంగ్రెస్ పార్టీలో తాను మినహా తతిమ్మా సీనియర్ నాయకులందరి పనితీరు మీద ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఆగ్రహానికి పర్యవసానంగా ఆయనలో వైరాగ్యం కూడా ప్రబలి… పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసేస్తానంటూ బెదిరింపులు కూడా షురూ చేశారు.
2004 నాటి పరిస్థితులకు తలొగ్గి మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసిన కాంగ్రెస్ పార్టీ… కీలుబొమ్మలా పనిచేయించింది. కాంగ్రెస్ అధ్యక్ష హోదాతో, పగ్గాలు సోనియా చేతుల్లోనే ఉండిపోయాయి. ఆ పదేళ్ల తరువాత కూడా చాన్నాళ్ల దాకా రాహుల్ ఆ బాధ్యతలను నెత్తికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. సోనియా ఆరోగ్యం కూడా విషమించిన నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. సారథి తానే గనుక ఎడా పెడా దేశమంతా తిరిగారు. మోదీ మీద తనకు వీలైనంత స్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు.
ఎన్నిచేసినా ఓటమి మాత్రం తప్పలేదు. పాపం రాహుల్ ను వైరాగ్యం అలముకుంది. రాజీనామా చేసేస్తానని పట్టుబట్టగా.. వద్దొద్దు సారధిగా మీరే ఉండండి అంటూ కాంగ్రెస్ సీనియర్లు ఆయనను బతిమాలుతున్నారు. ప్రధాని అయ్యేట్లయితే తప్ప.. ఓడిపోయినప్పుడు పార్టీ భారం మోయడానికి వెనుకాడే ఈ ధోరణి తో రాహుల్ ఎలా నెగ్గుకొస్తాడో గానీ.. చివరికి పార్లమెంటరీ నాయకుడిగా బాధ్యతను కూడా ఆయన వద్దనుకున్నారు. ఇంత వృద్ధాప్యపు వయసులో, అనారోగ్య పరిస్థితుల్లో సోనియా ఆ బాధ్యతను స్వీకరించాల్సి వస్తోంది.
గెలిచేట్లయితే పదవులు ఆశిస్తూ.. ఓడిపోయినప్పుడు… అన్ని బాధ్యతలూ వదిలేసుకుని.. బిందాజ్ గా ఉండాలనుకునేటువంటి.. రాహుల్ ధోరణి.. ఆయనలోని పలాయనవాదమా? లేదా వైరాగ్యమా? అని పలువురు చర్చిస్తున్నారు.
పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం