సీబీఐ ఉచ్చులో సుజనా! ఇది శ్రీకారమేనా?

ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత… అసలు నేరాలకు సంబంధించిన ఆరాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి, వ్యాపారవేత్త సుజనాచౌదరి ఇళ్లు…

ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత… అసలు నేరాలకు సంబంధించిన ఆరాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి, వ్యాపారవేత్త సుజనాచౌదరి ఇళ్లు కార్యాలయాలపై శనివారం మధ్యాహ్నం సీబీఐ సోదాలు మొదలయ్యాయి. బెంగుళూరు సీబీఐ అధికారులు ఏకకాలంలో మూడుచోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు. అయితే… కీలకం ఏంటంటే… సుజనా మీద జరుగుతున్న సీబీఐ సోదాలు కేవలం శ్రీకారం మాత్రమేనని, గత అయిదేళ్లలో విచ్చలవిడిగా అవినీతికి, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారందరి గుట్టుమట్టులను వెలికి తీయబోతున్నారని తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీతో తన ‘రిలేషన్’ ఎందుకు చెడిందో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పలేదు. కానీ, కేవలం హోదా కోసమే తాను సమస్త త్యాగం చేసేస్తున్నట్లుగా ఆయన ఎన్డీయేనుంచి బయటకు వచ్చారు. మోడీని తూలనాడడం ప్రారంభించారు. ‘మోడీ నా మీద కూడా (సీబీఐ, ఈడీ) దాడులు చేయిస్తాడు… నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు… మీరే (ప్రజలే) నన్ను రక్షించుకోవాలి’ అంటూ చంద్రబాబు రకరకాలు దీనారావాలు చేశాడు.

చంద్రబాబును రక్షించుకోవడం సంగతి తర్వాత.. మున్ముందుగా ఆయన విలాపాలను కూడా పట్టించుకోలేదని తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల సమయంలో గానీ.. ఐటీ, ఈడీదాడులు చాలామంది నాయకులపై జరిగినప్పటికీ.. తమ పార్టీ వారి మీద జరిగినప్పుడు పెద్దఎత్తున గోల చేస్తూ మోడీ తనను కార్నర్ చేస్తున్నట్లుగా ప్రజల సానుభూతి పొందడానికి చంద్రబాబు ప్రయత్నించాడు.

ఇప్పుడు పరిణామాలను గమనిస్తోంటే.. ఇదివరకు జరిగిందంతా ట్రైలర్ మాత్రమే అసలు షో ఇప్పుడు మొదలవుతోంది… అనిపిస్తోంది. గతంలో అనేక ఆర్థిక నేరాలతో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్న సుజనాచౌదరి మీద ఈడీ, ఐటీదాడులు చాలా జరిగాయి. ఇప్పుడు సీబీఐ సోదాలు మొదలయ్యాయి. సుజనాతో ప్రారంభం మాత్రమే అయిందని… గత అయిదేళ్లలో అధికారం అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరించిన వారందరికీ ఇప్పుడిక పూర్తిస్థాయిలో బ్యాడ్ పీరియడ్ మొదలైనట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం