తానాకు బాబు.. ఏ మొహం పెట్టుకు వెళతారో?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు పరాజయభారంతో కుంగిపోతున్నారు. ఇటు చెంపదెబ్బ అటు గోడదెబ్బ అన్నట్లుగా రాష్ట్ర-కేంద్ర రాజకీయాల్లో ఆయన పరిస్థితి మారిపోయింది. కనీసం అటో ఇటో ఏదో ఒకచోట తాను అనుకున్న ఫలితం దక్కి ఉంటే..…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు పరాజయభారంతో కుంగిపోతున్నారు. ఇటు చెంపదెబ్బ అటు గోడదెబ్బ అన్నట్లుగా రాష్ట్ర-కేంద్ర రాజకీయాల్లో ఆయన పరిస్థితి మారిపోయింది. కనీసం అటో ఇటో ఏదో ఒకచోట తాను అనుకున్న ఫలితం దక్కి ఉంటే.. ఆయన ఈ పాటికి నానా  హడావుడీ చేసేస్తుండేవారు. పాపం ఇప్పుడు పూర్తి సైలెంట్ గా మారిపోయారు. ఏపీలో మొహం చెల్లడం లేదన్నట్లుగా కొన్నాళ్లు హైదరాబాదు, విదేశాలు తిరిగి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయనను కీలక అతిథిగా ఆహ్వానించిన తానా సమావేశాలకు చంద్రబాబు వెళ్తారా? లేదా మొహం చాటేస్తారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.

అమెరికాలోని తెలుగు ప్రజలు ఘనంగా పెద్దఎత్తున నిర్వహించుకునే సమావేశాలు తానా, ఆటా మొదలైనవి. క్రమంగా ఈ సమావేశాలకు కుల ముద్రలు, ప్రాంతీయ ముద్రలు కూడా పడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో తానాకు కూడా ఒక ముద్ర ఉంది. ఈ ఏడాది తానా సభలు జులై మొదటివారంలో వాషింగ్టన్ డీసీలో జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును, తెలంగాణ నుంచి కేసీఆర్ ను, ఏపీ నుంచి చంద్రబాబునాయుడును చాలాకాలం కిందటే కీలక అతిథులుగా ఆహ్వానించారు.

కానీ ఏపీ రాజకీయాల్లో వాతావరణం తిరగబడిన తర్వాత.. కొత్త ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలిసి ఆహ్వానిస్తాం అని తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఇటీవల తిరుమలకు వచ్చిన సందర్భంగా చెప్పారు. అయితే వారి ఆహ్వానాన్ని మన్నించి… చివరి నిమిషంలో పిలిచినా సరే… ఎగేసుకుని జగన్ తానా సభలకు వెళ్లాడనే గ్యారంటీ ఏమీలేదు. అయితే ముందస్తుగా పిలిచినంత మాత్రాన చంద్రబాబు అయినా తానాకు వెళ్లకపోవచ్చునని తెదేపా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే ఆయనకు సరిగా మొహం చెల్లడంలేదు. హైదరాబాదులో ఉన్నారు. ప్రస్తుతానికి ఓ విదేశీ పర్యటన ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడినుంచి రాగానే మరో పదిరోజుల వ్యవధిలో మళ్లీ అమెరికా వెళితే… ఇక్కడి రాజకీయ పరిస్థితులకు జడిసి పారిపోతున్నారనే అపకీర్తి వస్తుంది. పైగా.. ఓడిపోయిన నేతగా తానాకు వెళ్లడం ఆయనకూ అవమానకరమే.

ఒకవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మరోవైపు తెలంగాణలో ఢంకా బజాయించి గెలిచిన పార్టీ ప్రతినిధిగా కేటీఆర్ ఉండగా వారి సరసన ఏపీలో ఘోరంగా ఓడిపోయిన పార్టీ నేతగా కూర్చోడానికి చంద్రబాబుకు అవమానంగా అనిపించవచ్చు. అందుకే చంద్రబాబు.. ఈసారి తానా సభలకు వెళ్లకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం