అదే కుట్ర: అప్పుడు ఎన్టీఆర్ పై.. ఇప్పుడు జగన్ పై..!

ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు అప్పట్లో ఎల్లో మీడియా చాలా రాతలు రాసింది. చంద్రబాబు అండతో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్ పై అప్పట్లో ఎన్నో కోర్టు కేసులు పడ్డాయి. రాజ్యాంగ…

ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు అప్పట్లో ఎల్లో మీడియా చాలా రాతలు రాసింది. చంద్రబాబు అండతో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్ పై అప్పట్లో ఎన్నో కోర్టు కేసులు పడ్డాయి. రాజ్యాంగ ఉల్లంఘన అంటూ కమిటీలు పడ్డాయి. శ్మశానంలో పూజలు చేస్తారని, నగ్నంగా పడుకుంటారని, కన్నెపిల్లలలో రహస్య వివాహాలు అంటూ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కథనాలు ఎన్నో వచ్చాయి. వీటికి తోడు తోటి ఎమ్మెల్యేల్నీ చీడపురుగుల్లా చూస్తారని, మోనార్క్ లా వ్యవహరిస్తారని రోజుకో కథనం వచ్చేది.

సరిగ్గా అప్పుడు ఎన్టీఆర్ పై ఎల్లో మీడియా ఎలాంటి కథనాల్ని వండివార్చిందో, దాదాపు ఆ పన్నాగాలన్నింటినీ ఇప్పుడు మరోసారి వెలికితీసింది ఆ మీడియా. బాబు అండతో ముఖ్యమంత్రి జగన్ పై లేనిపోని కథనాలు ఇస్తోంది. ఎన్టీఆర్ టైమ్ లో రాతలకే పరిమితమైంది మీడియా. కానీ ఇప్పుడు జగన్ టైమ్ లో రాతలతో పాటు కూతలు (ఎలక్ట్రానిక్ మీడియా) కూడా అదనం.

సరిగ్గా అప్పుడు ఎన్టీఆర్ కోసం వేసిన ఎత్తుగడలన్నీ ఇప్పుడు రిపీట్ అయిపోతున్నాయి. కోర్టు కేసులు లెక్కలేనన్ని పడుతున్నాయి. జగన్ ను ఓ మోనార్క్ గా, తలబిరుసు వ్యక్తిగా, ఫ్యాక్షనిస్టుగా, అతి పెద్ద అవినీతిపరుడుగా ముద్రవేసేందుకు.. ఎల్లో మీడియా చేయాల్సిన ఫీట్స్ అన్నీ చేస్తోంది.

పదేళ్ల కిందటే గ్రహించింది..

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబును, ఎల్లో మీడియాను ముప్పుతిప్పలు పెట్టారు. కొంతమంది అయితే వైఎస్ఆర్ దెబ్బకు కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఎప్పుడైతే వైఎస్ఆర్ ఈ లోకాన్ని వీడారో అప్పుడు మళ్లీ వీళ్లలో చలనం వచ్చింది. అదే టైమ్ లో వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా దృష్టి పెట్టింది. 

ఎప్పటికైనా జగన్ తో తమకు ఇబ్బందేనని గుర్తించింది. అందుకే పదేళ్లుగా జగన్ పై దాడులు చేస్తూనే ఉంది. అంతా అనుకున్నట్టుగానే ఓ వ్యక్తిగా వచ్చిన జగన్, మహావృక్షంలా ఎదిగారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎల్లో మీడియా తన రాతలు-కూతలు ఆపలేదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రాయడం, జగన్ ను చేతకానివ్యక్తిగా చూపించడానికి ప్రయత్నించడం నిరంతరం జరుగుతూనే ఉంది. 

చివరికి జగన్ దేవుడితో మాట్లాడతాడని, ఆయన తండ్రి వైఎస్ఆర్ తో రాత్రిళ్లు మాట్లాడతారంటూ నీచమైన కథనాలు కూడా వండివార్చే స్థితికి దిగజారిపోయింది ఎల్లో మీడియా. పార్టీలో చేరడానికి వచ్చిన ఓ మాజీ అధికారితో జగన్ ఈ మాటలు అన్నట్టు.. ఎల్లో మీడియా కట్టుకథలు అల్లింది.

నిజానికి ఇది చాలా చిన్న విషయం… గత పదేళ్ల నుంచి జగన్ పై జరుగుతున్న “ఎల్లో” దాడుల్ని ఓసారి పరిశీలిస్తే, ప్రస్తుతం చేసిన ఆరోపణ చిన్నదిగానే కనిపిస్తుంది. నటసార్వభౌముడు నందమూరి తారకరామారావును పదవీచ్యుతుడ్ని చేయడానికి చంద్రబాబు పన్నిన పన్నాగాలు, వైస్రాయ్ హోటల్ ఉదంతాలు అందరికీ తెలిసిందే. అభిమానుల దృష్టిలో దేవుడిగా ఉన్న ఎన్టీఆర్ ను ఎలా తక్కువ చేయాలో, ఎలాంటి కథనాలతో ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలో చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు.

అప్పుడు ఎన్టీఆర్ పై జరిగిన ఎల్లో దాడుల కంటే 10-15 రెట్లు ఎక్కువగా ఇప్పుడు జగన్ పై దాడులు జరుగుతున్నాయి. ఎల్లో మీడియా తన పెన్నుకు రోజుకో పదును పెడుతోంది. ఇష్టమొచ్చినట్లు రాసి పడేస్తోంది.

ఈసారి పప్పులుడకవు.

అయితే ఈసారి అను'కుల' మీడియా పప్పులుడకవు.. ఎందుకంటే అను'కుల' మీడియాకు అడ్డంగా సోషల్ మీడియా ఉంది. బాబు మీడియా చేస్తున్న ప్రతి తప్పును ఎత్తి చూపుతోంది. ప్రతి విమర్శను సాక్ష్యాలతో సహా తిప్పికొడుతోంది. కాబట్టి ఈసారి ఎల్లో మీడియా అంత ప్రభావం చూపలేకపోతోంది. 

ఇప్పటికే ఆ విషయం రుజువైంది కూడా. ఈ రెండేళ్లలో జగన్ పై బురద జల్లేందుకు బాబు మీడియా చేసిన ప్రయత్నాల్ని, పూర్తి ఆధారాలతో సోషల్ మీడియా బయటపెట్టింది. ఒకప్పుడు ఎల్లో మీడియా చెప్పిందే వేదం అన్నట్టు ఉండేది. మీడియా అంటే ఎల్లో మీడియానే. కానీ ఇప్పుడు ప్రజలకు సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఏదో ఒక  మీడియాను నమ్మే పరిస్థితి లేదు. స్వయంగా ప్రజలే, కుల మీడియా కథనాల్ని క్రాస్ చెక్ చేసుకునే రోజులివి.

అప్పటి ఎత్తులు.. ఇప్పుడు పనిచేయవు.

సోషల్ మీడియా సంగతి పక్కనపెడితే.. అప్పుడు ఎన్టీఆర్ పై చేసిన 'ఎల్లో' కుట్రల్లాంటివి ఇప్పుడు పనిచేయవు. ఎందుకంటే కాలం మారింది. ఇక్కడున్నది జగన్. ఎన్నో డక్కామొక్కీలు తిని ఈ స్థాయికి వచ్చిన జగన్ పై విమర్శలు చేయడమంటే.. కొండను చూసి కుక్కలు మొరిగినట్టే ఉంటుంది. పైగా ఒకప్పటి ఎన్టీఆర్, మొన్నటి వైఎస్ఆర్ కు, ఇప్పటి జగన్ కు వ్యవహారశైలిలో చాలా తేడా ఉంది. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ.. ఎక్కడా తగ్గేదేలే.

ఎన్ని కొర్రీలు పెడుతున్నా.. కోర్టు కేసులు వెంటాడుతున్నా.. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నా.. తను చేయాలనుకున్నది చేస్తున్నారు జగన్. ఈ రెండేళ్లలోనే చంద్రబాబుకు, అతడి మీడియాకు ఆ విషయం క్లియర్ గా అర్థమైంది కూడా. అందుకే వాళ్లలో గుబులు మరింత మొదలైంది. అందుకే ఎల్లో రాతలు కొత్త పుంతలు తొక్కాయి. ఆ మైకులకు కొత్త నోళ్లు వచ్చాయి. అయితే ఇవేవీ జగన్ ను ఏమీ చేయలేవు.