అసలు తలకాయే లేని బీజేపీ జాతీయ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శిరచ్ఛేదనం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏనుగుపై ఎవరూ చెత్త వేయలేరని, తనకు తానుగానే ఆ పని చేసుకుంటుందనే నానుడి చందంగా బీజేపీ వ్యవహార శైలి వుంది. అమరావతిపై బీజేపీ ఆడుతున్నట్టుగా మరే పార్టీ నాటకాలు ఆడలేదు. అందుకే ఆ పార్టీపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను శిఖండిలా అడ్డు పెట్టుకుని అమరావతి రాజధాని విషయంలో జాతీయ అధికార పార్టీని టీడీపీ బద్నాం చేస్తోంది. ఏపీ బీజేపీ నేతలు రాజధానిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకరేమో అంగుళం కూడా అమరావతి నుంచి కదలదని భరోసా ఇస్తారు. మరొక నాయకుడేమో ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని తేల్చి చెబుతారు. ఇంతకూ ఎవరి చెప్పింది నిజమో అర్థం కాని అయోమయ స్థితిలో అమరావతి రైతులున్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని మార్పు ప్రకటించిన 900 రోజులకు పైబడిన తర్వాత తీరిగ్గా ఏపీ బీజేపీ నేతలు ‘మనం- మన అమరావతి’ పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరులో ముగింపు సభలో సత్యకుమార్ పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
‘అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ఎంతో చిత్తశుద్ధితో ఉంది. శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడికి శిరచ్ఛేదనం చేయడానికి వంద తప్పులు చేసేదాక ఆగక తప్పలేదు. ఈ అభినవ శిశుపాలుడి పాపాల చిట్టా పెరుగుతోంది. ఢిల్లీలోని శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కటీ లెక్కేసుకుంటున్నాడు. వంద తప్పులకు చేరిన రోజు ఆ శ్రీకృష్ణుడు ఈ అభినవ శిశుపాలుడికి శిరచ్ఛేదనం చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. భారతీయ జనతాపార్టీ కార్యకర్తగా, నా మాటగా చెబుతున్నా’ …ఇవీ సీఎం జగన్‌ను ఉద్దేశించి సత్యకుమార్ ప్రగల్భాలు.
సత్యకుమార్‌కు తలకాయలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా 2018, ఫిబ్రవరి 23న కర్నూల్లో రాయలసీమ బీజేపీ నేతల సమావేశాన్ని గుర్తు చేస్తున్నారు. నాడు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ నాటి టీడీపీ ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
ఆ డిక్లరేషన్‌లో ఏముందో సత్యకుమార్‌కు నెటిజన్లు పాయింట్లవారీగా గుర్తు చేయడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి కర్నాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సెక్రటేరియట్, ఇతర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి. ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి భవనం ఏర్పాటు చేయాలి. గవర్నర్ తాత్కాలిక విడిదికి నివాసం రాయలసీమలో ఏర్పాటు చేయాలి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న తాత్కాలిక హైకోర్టు సైతం రాయలసీమ లోనే ఏర్పాటు చేయాలి’ తదితర అంశాలపై రాయలసీమ బీజేపీ నేతలు స్పష్టమైన ఎజెండాను ప్రకటించారు.
రాయలసీమలోని ప్రొద్దుటూరుకు చెందిన నాయకుడిగా చెప్పుకునే సత్యకుమార్‌కు రాయలసీమ డిక్లరేషన్ గురించి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. తలకాయ ఉన్నోడికైతే ఇవన్నీ తెలుస్తాయని, అది లేనోడే ఇతరుల తలలు తీస్తామని మాట్లాడుతుంటాడని నెటిజన్లు వెటకరిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళితే, అక్కడి కూత కూసే బీజేపీ నేతలతోనే రాష్ట్రానికి ప్రమాదమని ప్రజలు హెచ్చరిస్తున్నారు.