మీడియా ఒక తాటిపైకి వస్తుందా?

టీవీ 9లో రవిప్రకాష్ వ్యవహారం ఆంధ్ర మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, అధికశాతం మీడియా ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో వుందన్న సంగతి తెలిసిందే. అది విజవల్, వెబ్,…

టీవీ 9లో రవిప్రకాష్ వ్యవహారం ఆంధ్ర మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, అధికశాతం మీడియా ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో వుందన్న సంగతి తెలిసిందే. అది విజవల్, వెబ్, ప్రింట్ ఏ మాధ్యమమైనా కావచ్చు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ మాధ్యమాలు కూడా రెండురకాల ధోరణులకు అనుగుణంగా మారాయి.

ఆంధ్రలో ప్రో చంద్రబాబు, తెలంగాణలో ప్రో కేసిఆర్ అన్న స్టాండ్ తీసుకున్నాయి. దాంతో దాదాపు అయిదేళ్లుగా ఎటువంటి సమస్య లేకుండా పోయింది. కానీ మొన్నటి ఎన్నికల సందర్భంగా కేసిఆర్ కు ఈ మీడియాతో కాస్త ఇబ్బంది వచ్చింది. మహాకూటమికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.

టీవీ 9ను కొనుగోలు చేసిన మేనేజ్ మెంట్, మొదట ఎడిటోరియల్ లో వేలు పెట్టకపోయినా, మొన్న ఆంధ్ర ఎన్నికల సందర్భంగా కాస్త వత్తిడి చేసినట్లు బోగట్టా. కానీ పని జరగలేదు. దాంతో తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం తప్ప దారిలేదు. 90 శాతం పెట్టుబడి తమదైనపపుడు ఏ మేనేజ్ మెంట్ అయినా అదే చేస్తుంది.

ఇదిలావుంటే మొన్నటికి మొన్నే ఈనాడు మీద తెరాస పత్రిక నమస్తే తెలంగాణ పెద్దఎత్తున వార్తలు ప్రచురించింది. ఎన్టీవీ విషయంలో కూడా ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కూడా తెరాస అనుకూల వర్గాలకు షేర్ వుందని వదంతులు వున్నాయి. అందువల్ల అక్కడ కూడా ఏదో మార్పులు వుంటాయని గుసగుసలు అయితే వున్నాయి.

ఆంధ్రలో జగన్ ప్రభుత్వం వస్తే ఎబిఎన్-ఆంధ్రజ్యోతికి సమస్య అని ఊహాగానాలు ఇవ్పటికే వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టోటల్ ఆంధ్ర జనాల స్వాధీనంలో వున్న మీడియా అంతంటినీ ఓ తాటి మీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవిప్రకాష్ కు జరిగింది అని చంకలు గుద్దుకుంటే, రేపు మరొక్కళ్ల వంతు వస్తుందని తెరవెనుక హితబోధలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రవి ప్రకాష్ ఉదంతం నేపథ్యంలో ఈ మీడియా అంతా ఒక తాటిపైకి వస్తే మంచిది అన్న సూచనలు తెరవెనుక నుంచి బలంగా అందుతున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ..ఎమ్మెల్యేగా గెలవాలంటే అదే జరిగుండాలి!