కొద్దినెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయ అరంగ్రేటం చేసారు స్వామి పరిపూర్ణానంద. కాకినాడ బేస్ గా కార్యకలాపాలు జరిపే ఆయన తెలంగాణలో చేసిన ప్రసంగాలతో కేసిఆర్ ఆగ్రహానికి, హైదరాబాద్ బహిష్కరణకు గురయ్యారు. ఆ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ 'తీర్థం' తీసుకుని, తన లెవెల్లో తన ప్రచారం చేసారు. కానీ ఫలితం శూన్యం.
ఎన్నికల అనంతరం పరిపూర్ణానంద స్వామి మాట కానీ, పలుకు కానీ వినిపిస్తే ఒట్టు. ఎన్నికల ఫలితాలపై ఆయన కామెంట్ అన్నదే లేదు. ఆయన హైదరాబాద్ లో వున్నారో, కాకినాడ పీఠంలో వున్నారో జనరల్ పబ్లిక్ కు తెలియదు. వాస్తవానికి ఆయనకు తెలంగాణలో ఎంతమంది భక్తులు వున్నారో, ఫాలోవర్స్ వున్నారో అన్నది పక్కన పెడితే, ఆంధ్రలో బాగానే వున్నారు.
ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలు రాబోతున్నాయి. మరి భాజపా ఈ స్వామీజీ సేవలను ఆంధ్రకు కూడా వాడుకుంటుందా? లేదా తెలంగాణలో వచ్చిన ఫలితం చూసి, స్వామీజీ ఆంధ్రలో సైలంట్ అవుతారా? పైగా ఆంధ్రలో భాజపా పరిస్థితి భాగాలేదు.
చంద్రబాబు చాలా తెలివిగా దాన్ని ఎంత బదనామ్ చేయించాలో అంతా చేసారు. ఇక మిగిలింది ఏమీలేదు. అందువల్ల అక్కడ పరిపూర్ణానంద ప్రచారం చేస్తే ఫలితం అంతగా వుండకపోవచ్చు. అందువల్ల పరిపూర్ణానంద ప్రస్తుతానికి రాజకీయ మౌనవ్రతంలోనే మరి కొన్నాళ్లు వుండే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది.