బయోపిక్ అంటే.. రియల్ లైఫ్ క్యారెక్టర్ కీ, అందులో నటిస్తున్న వారికీ కచ్చితంగా పోలికపెట్టి చూస్తారు ప్రేక్షకులు. క్రీడాకారుల రియల్ లైఫ్ క్యారెక్టర్ లు ఎవరికీ పెద్దగా తెలియవు కాబట్టే.. వారి బయోపిక్స్ లో డ్రామా బాగా ఎలివేట్ అయి, అవి విజయవంతం అయ్యాయి. సావిత్రి బయోపిక్ విషయంలో తనపై లేని అంచనాలను కీర్తిసురేష్ అందుకోవడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా మిగిలింది.
ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. బాలకృష్ణను మహానటుడి పాత్రలో ప్రేక్షకులు అంగీకరించలేదు. దర్శకత్వ లోపాలతో పాటు నటుడిగా ఎన్టీఆర్ తో బాలయ్యను పోల్చి చూడలేకపోయారు. అందుకే తొలిభాగం డిజాస్టర్ అయింది. పార్ట్-2గా వస్తున్న మహానాయకుడులో రాజకీయ కోణం ఆసక్తిగా ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.
ఇక యాత్ర విషయానికొద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి సినీనటుడు కాదు, ఆయన హావభావాలు, ప్రజలతో మాట్లాడే తీరు.. అంతా ఆయన ఒరిజినల్. టెక్నాలజీ పుణ్యమా అని రికార్డెడ్ వీడియోల ద్వారా ఇంకా వైఎస్ఆర్ ప్రజల్లో జీవించే ఉన్నారు.
యాత్రలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వంకపెట్టలేని ఉత్తమనటుడు. 3సార్లు జాతీయ అవార్డు అందుకున్న గొప్ప ఆర్టిస్ట్. అలాంటి మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాడు. ట్రైలర్లు, ప్రోమోలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. యాత్రలో మమ్ముట్టి తన సొంత గొంతు కూడా వినిపిస్తుండటం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
వైఎస్ఆర్ క్యారెక్టర్ లో కావాల్సినంత డ్రామా పండించడానికి మమ్ముట్టికి స్కోప్ దొరికింది. అందుకే సహజనటుడు చెలరేగిపోయాడు. ప్రజాయాత్రలో అడుగడుగునా పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగే వైఎస్ఆర్ పాత్ర అద్భుతంగా వచ్చిందని సమాచారం. పేదలతో మాట్లాడేటప్పుడు, వారి కష్టాలు చూసి చలించిపోయేటప్పుడు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కచ్చితంగా వైఎస్ఆర్ ని గుర్తు చేస్తాయని చెబుతున్నారు.
ఒక ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడి క్యారెక్టర్ ని ఒక ఫుల్ టైమ్ నటుడు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ యాత్రకు మమ్ముట్టి కచ్చితంగా ప్లస్ అవుతాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తో పోల్చిచూస్తే మమ్ముట్టి తప్ప యాత్రలో చెప్పుకోతగ్గ నటీనటులు లేరు. స్టార్ కాస్ట్ తో పాటు, బడ్జెట్ లో కూడా భారీ గ్యాప్ ఉంది. నందమూరి అభిమానులే కాదు, టీడీపీ నాయకులంతా ఎన్టీఆర్ బయోపిక్ ని గొప్పగా ప్రమోట్ చేశారు.
కానీ యాత్ర విషయంలో ఎవరూ అలా ఓన్ చేసుకోలేదు. సినిమా టాక్ ఆధారంగానే బాక్సాఫీస్ జర్నీ ఉంటుంది. మొత్తమ్మీద మమ్ముట్టి నటనే యాత్రకు ప్రధానాకర్షణ కానుంది. ఎన్టీఆర్ కి బాలయ్య మైనస్ అయితే యాత్రకి మమ్ముట్టి ప్లస్ అవుతున్నాడు.