ఆంధ్రప్రదేశ్ వరప్రదాయని పోలవరం ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుంది. ప్రాజెక్టుకు సంబంధించి గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం మొదలైంది. వరదలు వచ్చేనాటికి స్పిల్ వే నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఉంటే, ప్రస్తుతానికి 42 గేట్లను ఫిక్స్ చేశారు. ఒక్కో గేటుకు 2 చొప్పున హైడ్రాలిక్ సిలిండర్ల అమరికి కూడా పూర్తయింది. వీటికి అనుసంధానంగా 17 పవర్ ప్యాక్స్ ఏర్పాటుచేశారు. ఒక్కో పవర్ ప్యాక్ తో 2 గేట్లను ఎత్తొచ్చు.
ప్రస్తుతానికి 40 మీటర్ల ఎత్తుకు 6 గేట్లను లిఫ్ట్ చేశారు అధికారులు. వర్షాకాలం వచ్చి వరదలు మొదలయ్యే సమయానికి 42 గేట్లకు పవర్ ప్యాక్స్ అమర్చి, గేట్లను లిఫ్టింగ్ కు అనువుగా ఉంచుతామని ప్రకటించారు. వరద నీటిని స్పిల్ వే గుండా కిందకు వదలడానికి వీలుగా మరికొన్ని రోజుల్లో ఈ గేట్లు అన్నీ పూర్తిస్థాయిలో సిద్ధమౌతాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మాత్రమే పోలవరం పనులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టును తన తొలి ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా పెట్టుకున్న జగన్.. పోలవరం ప్రాజెక్టును తన హయాంలో పూర్తిచేస్తానని శపథం చేశారు. చెప్పినట్టుగానే శరవేగంగా పనుల్ని పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం అద్భుతంగా పనిచేసింది.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. వారానికొకసారి పిక్నిక్ కు వెళ్లొచ్చినట్టు వెళ్లడం, ఫొటోలు దిగడం హాబీగా పెట్టుకున్నారు చంద్రబాబు. అక్కడితో ఆగకుండా బస్సుల్లో జనాల్ని అక్కడికి తీసుకెళ్లడం, వాళ్లకు భోజనాలు పెట్టడం, వాళ్లకు మళ్లీ ఫొటోల కార్యక్రమం.. బాబు హయాంలో ఇలా అసలు పనులు తక్కువ, కొసరు పనులు ఎక్కువ అన్నట్టు జరిగింది. దీనికితోడు ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి కేంద్రానికి బిల్లులు సమర్పించకుండా నాన్చి, ప్రాజెక్టును మరింత లేట్ చేశారు.
ఈ అవ్యవస్థలన్నింటినీ జగన్ కొన్ని రోజుల వ్యవథిలోనే చక్కదిద్దారు. అధికారులకే కాదు, మంత్రులకు కూడా టార్గెట్ విధించారు. మరోవైపు బాబు పట్టించుకోకుండా వదిలేసిన పునరావాస ప్యాకేజీని అమలుచేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పర్యావరణ అనుమతుల్లో బాబు జాప్యం చేస్తే, జగన్ ప్రత్యేక చొరవ చూపించి మరీ అనుమతులు తీసుకొచ్చారు. ఇలా అన్నీ తానై వ్యవహరించి పోలవరం పనుల్ని చకచకా పూర్తిచేస్తున్నారు జగన్.