ఏమోలేమ్మా…నీ ఇష్టం, నీ ఓపిక‌!

ఒక‌సారి సినిమా చూస్తే అదో తృప్తి. సినిమా మ‌రీ బాగుంటే రెండోసారి కూడా చూడొచ్చు. మూడో సారి కూడా అదే సినిమా చూశారంటే …అదో ముద్దు అని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ వంద‌ల సార్లు చూసిన…

ఒక‌సారి సినిమా చూస్తే అదో తృప్తి. సినిమా మ‌రీ బాగుంటే రెండోసారి కూడా చూడొచ్చు. మూడో సారి కూడా అదే సినిమా చూశారంటే …అదో ముద్దు అని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ వంద‌ల సార్లు చూసిన సినిమానే చూడ్డం అంటే …ఏమోలేమ్మా, నీ ఇష్టం, నీ ఓపిక అని కాస్త నిరుత్సాహంగా అన‌కుండా ఉండ‌రు.

ఎందుకంటే స‌మ‌యం అనేది చాలా విలువైన‌ది. ప్ర‌తి నిమిషం చాలా విలువైన‌ది. పోయిన స‌మ‌యాన్ని తిరిగి తీసుకురాలేం అంటారు. అలాంటిది క్ష‌ణంక్ష‌ణం ఎంతో విలువైన‌దిగా భావించే ప్ర‌స్తుత కాలంలో ఓ హీరోయిన్ ఏకంగా ఒక సినిమాను 267 సార్లు చూసిందంటే ఏం చెప్పాలి? చెప్ప‌డానికి మాట‌లు రావు.

హిందీలో రాణిస్తున్న మ‌న తెలుగు హీరోయిన్ శ్రేయా ధ‌న్వంత‌రి త‌న‌కిష్ట‌మైన 'క్షణక్షణం' చిత్రాన్ని ఏకంగా 267 సార్లు చూసిన‌ట్టు చెప్పుకొచ్చారు. 

జోష‌త్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయా ధ‌న్వంత‌రి, ఆ త‌ర్వాత ది ఫ్యామిలీ మ్యాన్‌, స్కామ్ 1992 వెబ్ సిరీస్‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీటిలో మంచి ఫ‌ర్మామెన్స్ ఇవ్వ‌డంతో హిందీలో అవ‌కాశాలు ద‌క్కించుకున్నారు. అయితే ఆమెకు తెలుగు సినిమాలంటే చ‌చ్చేంత ఇష్టం.

ఈ నేప‌థ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించినన 'క్షణక్షణం' చిత్రాన్ని 267 సార్లు చూసిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారామె. తెలుగులో త‌న‌ ఫేవరెట్‌ సినిమా క్షణక్షణం అని చెప్పుకొచ్చారామె. ఈ సినిమాలో హీరో దగ్గుబాటి వెంకటేష్‌, పరేశ్‌ రావల్‌, శ్రీదేవి అద్భుతంగా నటించార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు మ‌రిన్ని మంచి సినిమాల గురించి ప్ర‌స్తావించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి బీజీఎమ్‌ కూడా సూపర్‌గా ఉంటుందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి సినిమాల‌ను ఎన్నిసార్లు చూసినా బోరు కొట్ట‌వ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం విశేషం.