స‌ర‌దా సినిమా, లోతైన స్ప‌ర్శ‌.. గ్రీన్ బుక్

అమెరికాలో న‌ల్ల‌జాతివాళ్ల బాధ‌ల‌ను ఎంతో అర్థ‌వంతంగా, అందరికీ అర్థ‌మ‌య్యేలా ఆవిష్క‌రించిన సినిమాలెన్నో ఉన్నాయి. సినిమా ఆర్ట్ ఫామ్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ వివ‌క్ష మీద అనేక సినిమాలు వ‌చ్చాయి, వ‌స్తూనే ఉన్నాయి. న‌ల్ల‌జాతి బానిస‌ల…

అమెరికాలో న‌ల్ల‌జాతివాళ్ల బాధ‌ల‌ను ఎంతో అర్థ‌వంతంగా, అందరికీ అర్థ‌మ‌య్యేలా ఆవిష్క‌రించిన సినిమాలెన్నో ఉన్నాయి. సినిమా ఆర్ట్ ఫామ్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ వివ‌క్ష మీద అనేక సినిమాలు వ‌చ్చాయి, వ‌స్తూనే ఉన్నాయి. న‌ల్ల‌జాతి బానిస‌ల క‌థ‌ల‌తో మొద‌లుపెడితే, సివిల్ వార్, అనంత‌ర ప‌రిణామాల మీద కూడా బోలెడ‌న్ని గొప్ప సినిమాలు వ‌చ్చాయి, వ‌స్తున్నాయి. న‌ల్ల‌జాతి ప్ర‌జ‌లను తెల్ల‌జాతి వారు హింసించిన వైనం, వారిని జంతువుల త‌ర‌హాలో వాడుకున్న చ‌రిత్ర గురించి, ప్ర‌స్తుత స‌మాజంలో కూడా వారి ప‌ట్ల ఉండే వివ‌క్ష‌త‌ను ఈ సినిమాల‌న్నీ ర‌క‌ర‌కాలుగా వ్య‌క్తీక‌రిస్తూ ఉన్నాయి. 

గ్రీన్ బుక్ కూడా అలాంటి క‌థే. అయితే ఆద్యంతం అత్యంత సున్నితంగా, స‌ర‌దా తీరున సాగ‌డ‌మే ఈ సినిమా ప్ర‌త్యేక‌. 2018 ఆస్కార్స్ లో ఉత్త‌మ చిత్రంగా, ఉత్త‌మ స్క్రీన్ ప్లే గా నిలిచిన గ్రీన్ బుక్ ఒక వాస్త‌వ క‌థ‌. 70వ ద‌శ‌కంలో అమెరిక‌న్ స‌మాజంలో ఒక క‌ళాకారుడిగా ఉత్త‌మ స్థాయి ఆద‌ర‌ణ‌ను పొందుతూనే, కేవ‌లం త‌న వ‌ర్ణ రీత్యా అడుగ‌డుగునా వివ‌క్ష‌ను ఎదుర్కొనే ఒక వ్య‌క్తి, అత‌డి తెల్ల‌జాతి డ్రైవ‌ర్ రెండు నెలల‌ పాటు సాగించిన ఒక ప్ర‌యాణం క‌థ ఇది.

ఏ విష‌యాన్ని చెబుతున్నామ‌నేది ప్ర‌ధానం కాదు, ఎలా చెబుతున్నామ‌నేదే సినిమా విష‌యంలో అస‌లు విష‌యం. న‌ల్ల‌జాతివాళ్లను వివ‌క్ష‌తో చూసే తెల్ల‌వాళ్లు కూడా  ఈ సినిమాను ఆస్వాదించ‌గ‌ల‌రు, ఆ కాసేపైనా అయ్యో పాపం అని వారు ఎదుర్కొనే వివ‌క్ష ప‌ట్ల సానుభూతి చూప‌గ‌ల‌రు. అంత గొప్ప‌గా ఈ సినిమా క‌థ‌నం సాగుతుంది. న‌ల్ల‌జాతి వాళ్ల బాధ‌లను తెలియ‌జెప్ప‌డం అంటే.. తీవ్ర‌మైన హింసాత్మ‌క స‌న్నివేశాల‌నో, లేక వారి బ‌తుకుల్లోని మురికిని చూప‌డ‌మో కాకుండా… ఆర్థికంగా హై క్లాస్ లైఫ్ ను అనుభ‌వించే ఒక ఆఫ్రిక‌న్-అమెరిక‌న్ అక్క‌డి స‌మాజంలో మాన‌సికంగా ఎదుర్కొనే హింస‌ను మాత్ర‌మే చూపుతూ, అది కూడా విసిగించ‌ని రీతిలో హృద్యంగా ఆవిష్క‌రించే సినిమా గ్రీన్ బుక్.

ఈ సినిమాకు సంబంధించి మ‌రో గొప్ప అంశం డీప్ క్యారెక్ట‌ర్ స్ట‌డీ. న‌ల్ల‌జాతీయుడు, అత‌డికి డ్రైవ‌ర్ గా వ‌చ్చే తెల్ల‌జాతీయుడు మ‌ధ్య ఈ ప్ర‌యాణంలో ఆవిష్కార‌మ‌య్యే స్నేహమే ఈ సినిమాను చిర‌కాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. టామ్ అండ్ జెర్రీలా మొద‌ల‌య్యే వారి ప్ర‌యాణం… అత్యంత ఆప్తులుగా మారుస్తుంది. కేవ‌లం డ‌బ్బు కోసం మొద‌ల‌య్యే వారి ప్ర‌యాణం గొప్ప తీరాల‌కు చేరుతుంది.

ఆరంభంలో చాలా సేపు అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డు ద‌ర్శ‌కుడు. తెల్ల‌జాతి వ్య‌క్తి పాత్ర‌కు సంబంధించిన ఉపోద్ఘాతం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంలోని ప‌రిస్థితులు, నల్ల‌వారిపై స‌గ‌టు తెల్ల‌వాడిలో ఉండే వివ‌క్ష అత‌డిలోనూ ఉన్న వైనాన్ని చూపించే సీన్లుంటాయి. అవ‌న్నీ చాలా ఫ‌న్నీగా సాగ‌డంతో సినిమాలోకి ప్రేక్ష‌కుడు క్ర‌మంగా లీన‌మ‌వుతాడు.

క‌థ విష‌యానికి వ‌స్తే… ఫ్రాంక్ టోనీ వెల్లెలొంగా అలియాస్ టోనీ లిప్ ఒక నైట్ క్ల‌బ్ లో ప‌ని చేస్తూ ఉంటాడు. అక్క‌డ తాగాకా గొడ‌వ చేసే వాళ్ల‌ను త‌ర‌మ‌డం అత‌డి ప‌ని, అక్క‌డ‌కు వ‌చ్చే వారి వ‌స్తువుల‌ను త‌స్క‌రించి మ‌ళ్లీ వాళ్ల‌కు త‌నే అప్ప‌గిస్తూ టిప్స్ పొందే స్వ‌భావం అత‌డిది. అయితే త‌న‌కు ప‌ని ఇచ్చిన వారికి మాత్రం పూర్తి విధేయ‌త‌తో ఉంటాడు. వారిని త‌న‌వార‌నుకుని ప‌ని చేసే వ్య‌క్తిత్వం. త‌ను ప‌ని చేస్తున్న నైట్ క్ల‌బ్ ను నిర్వాహ‌కులు రీఇన్నొవేట్ చేసే ప‌ని మొద‌లుపెట్ట‌డంతో టోనీ లిప్ జాబ్ లెస్ అవుతాడు. ఇత‌డివి ఇటాలియ‌న్ మూలాలు. తెలిసిన వారిని జాబ్ అడిగితే.. గార్బేజ్ ట్ర‌క్ న‌డిపే ఉద్యోగం ఉందంటారు. 

ఇంటి రెంట్ కూడా క‌ట్టుకోవ‌డం క‌ష్టం అవుతుంది. అప్పుడు తెలిసిన వారి ద్వారా ఒక డాక్ట‌ర్ కు డ్రైవ‌ర్ అవ‌స‌రం ఉంద‌నే వ‌ర్త‌మానం అందుతుంది. అత‌డిని క‌ల‌వ‌డానికి ఒక థియేట‌ర్ అడ్ర‌స్ ఇస్తారు. థియేట‌ర్ పైన నిర్మించిన ఒక విలాస‌వంత‌మైన ఇంట్లో అత‌డి నివాసం. తీరా అక్క‌డ‌కు వెళ్లాకా తెలిసేది ఏమిటంటే.. అత‌డు ఒక డాక్ట‌ర్ కాదు. ఒక గొప్ప పియానో ప్లేయ‌ర్. అంత‌కు మించిన ఆశ్చ‌ర్యం అతడొక న‌ల్ల‌జాతివాడు!

త‌ను అమెరికా ద‌క్షిణ భాగంలో కొన్ని షోల‌కు అటెండ్ కావాల్సి ఉంద‌ని, రెండు నెల‌ల పాటు ప‌ర్య‌ట‌న అని, ఈ స‌మయంలో త‌న వెంట ఉండే ఒక కారు డ్రైవ‌ర్ త‌న‌కు అవ‌స‌ర‌మ‌ని ఆ పియానో ప్లేయ‌ర్ డాక్ట‌ర్ డాన్ షిర్లే చెబుతాడు. మంచి శాల‌రీని ఆఫ‌ర్ చేస్తాడు. అయితే త‌న వెంట ఉంటే త‌న ప‌నుల‌న్నీ చేసి పెట్టాల‌ని, త‌న బ‌ట్ట‌లు ఉతికి, ఐర‌న్ చేసే డ్యూటీ కూడా ఉంటుంద‌ని టోనీ లిప్ కు చెబుతాడు ఆ పియానిస్ట్. అంతా ఓకే కానీ, అలాంటి ప‌నుల‌ను త‌ను చేయ‌లేనంటూ లిప్ లేచి వ‌చ్చేస్తాడు. చివ‌ర‌కు ఆ ప‌నుల నుంచి మిన‌హాయింపును ఇస్తూ, మంచి రెమ్యూన‌రేష‌న్ తో డ్రైవింగ్ ప‌నికి కుద‌ర‌తాడు లిప్. వారి ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది.

ఈ ప్ర‌యాణంలో ఎన్నో ర‌కాల అనుభ‌వాలు ఎదుర‌వుతూ ఉంటాయి. లిప్ కు చిన్ని చిన్ని దొంగ‌త‌నాలు చేసే అల‌వాటు. మొద‌ట్లోనే ఒక చోట ల‌క్కీ స్టోన్స్ అమ్మే ద‌గ్గ‌ర కింద ప‌డిపోయిన స్టోన్ కొట్టేస్తాడు. అది అర్థం చేసుకున్న షిర్లే ఆ స్టోన్ ను అక్క‌డే పెట్టేసి ర‌మ్మ‌ని ఆదేశిస్తాడు. షిర్లేకు ఎదురుతిర‌గ‌లేక‌, అత‌డి ఆదేశాల‌ను పాటించ‌లేక లిప్ స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటాడు. కారు డ్రైవింగ్ స‌మ‌యంలో సిగ‌రెట్ తాగొద్ద‌ని షిర్లే మ‌రో ఆదేశ‌మిస్తాడు. అదేమంటే నీ హెల్త్ గురించే అని చెబుతాడు. గంభీరంగా మొద‌ల‌య్యే వారి ప్రయాణంలో వారిద్ద‌రూ   రోజులు గ‌డిచే కొద్దీ స్నేహితులుగా మారే ప్ర‌క్రియ చాలా అద్భుతంగా ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు.

షిర్లే న‌ల్ల‌జాతి వాడు కావ‌డం, అత‌డికి డ్రైవ‌ర్ గా ఒక తెల్ల జాతీయుడు ఉండ‌టం ప‌ట్ల రోడ్లో చూసే వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు! ప్ర‌త్యేకించి అప్ప‌టికే బానిస‌త్వం సౌత్ లో కూడా ర‌ద్దు అయినా, న‌ల్ల‌జాతి వారి ప‌ట్ల ఎంతో వివ‌క్ష ఉంటుంది ద‌క్షిణాదిన‌. న‌ల్ల‌జాతి వాళ్లు రాత్రిళ్లు బ‌య‌ట‌కు రాకూడ‌దు, వారికి కొన్ని ర‌కాల రెస్టారెంట్ల‌లోకి ప్ర‌వేశం లేదు,  తెల్ల‌జాతి వారి ఇళ్ల‌లో వారు బాత్ రూమ్ కూడా ఉప‌యోగించ‌కూడ‌దు.. అనే క‌ఠిన‌మైన నియ‌మాలు ఉండే సౌత్ లో ఆ న‌ల్ల‌జాతి క‌ళాకారుడుకు ఎదుర‌య్యే అనుభ‌వాలూ, వాటికి సాక్ష్యంగా నిలిచే ఒక ఇటాలియ‌న్ మూలాలున్న తెల్ల‌వాడు స్పందించే తీరే మిగ‌తా సినిమా అంతా. ఈ క్ర‌మంలో వారు ప‌ర‌స్ప‌రం మ‌రొక‌రిని గౌర‌వించుకోవ‌డం, ఒక‌రిని మ‌రొక‌రు వెన‌కేసుకు రావ‌డం, త‌మ త‌మ క‌ష్టాల‌ను చెప్పుకుని వాదించుకునే స‌న్నివేశాలు ఈ సినిమాకు ప్రాణం.

తొలి సీన్లో త‌న ఇంట్లో ఇద్ద‌రు న‌ల్ల‌జాతీయులు గాజు గ్లాసుల్లో జ్యూస్ తాగితే , వారు వెళ్లిపోయాకా, త‌న భార్య‌కు కూడా చెప్ప‌కుండా ఆ గ్లాసుల‌ను డ‌స్ట్ బిన్ లో  ప‌డేసే టోనీ లిప్ .. న‌ల్ల‌జాతి వ్య‌క్తికి డ్రైవ‌ర్ గా వెళ్తాడు. అదంతా కేవ‌లం డ‌బ్బు కోస‌మే. అయితే..  ఒక్క‌సారి త‌ను బాధ్య‌త‌ల్లోకి దిగాకా… పియానిస్ట్ గా షిర్లే గొప్ప‌ద‌నాన్ని ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించాకా.. అత‌డికి ఫ్యాన్ అవుతాడు. అత‌డి ప్ర‌తిభ‌కు త‌ల‌వంచుతాడు. ఆ త‌ర్వాత అత‌డి రంగేమిటీ, రూపేమీటో ప‌ట్టించుకోడు. షిర్లే వ్య‌క్తిత్వాన్ని గౌర‌విస్తాడు. అయితే.. మిగ‌తా అమెరికా కు ఆ మాత్రం ప‌రిణ‌తి ఉండ‌దు!

షిర్లేను స్టేజీ మీద కూర్చోబెట్టి అత‌డు పియానో వాయిస్తున్న‌ప్పుడు ఆస్వాధిస్తూ, అత‌డి షో ముగియ‌గానే క‌ర‌ళాల ధ్వ‌నులు చేసే వైట్ అమెరిక‌న్లు.. తీరా పియానో నుంచి ప‌క్క‌కు వ‌చ్చాకా షిర్లేను ఒక నీగ్రోగానే చూస్తారు. అత‌డిని త‌మ‌తో పాటు క‌లిసి భోజ‌నం చేయ‌నివ్వ‌రు.  తాము వాడే బాత్ రూమ్ ను వాడ‌నివ్వ‌రు,  వాయిస్తున్నంత‌సేపే క‌ళాకారుడు. ఆ త‌ర్వాత అత‌డో నీగ్రో.

ఒక చోట వీళ్ల కారును పోలీసులు ఆపుతారు. న‌ల్ల‌జాతివాడు రాత్రిపూట ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌‌ని ప్ర‌శ్నిస్తారు. అయినా న‌ల్ల‌జాతివాడికి తెల్ల‌జాతి డ్రైవ‌ర్ ఏమిటి? అని ఆశ్చ‌ర్య‌పోతారు. టోనీ లిప్ ఇంటి పేరు డిఫ‌రెంట్ ఉండ‌టంతో ఇటాలియ‌న్ మూలాల‌ని అర్థం కాగానే.. ఇటాలియ‌న్లు స‌గం నీగ్రోలు క‌దా అంటూ సెటైర్ వేస్తారు. దీంతో టోనీ పోలీసుల‌తో క‌ల‌బ‌డ‌తాడు. వారు షిర్లే, టోనీని తీసుకెళ్లి జైల్లో ప‌డేస్తారు. 

అర్ధ‌రాత్రి పూట త‌న‌కు తెలిసిన లాయ‌ర్ కు ఫోన్ చేస్తానంటూ షిర్లే పోలీసుల‌ను కోర‌తాడు. చివ‌ర‌కు చ‌ట్ట‌ప‌రిధిలో అత‌డికి అవ‌కాశం ఇస్తారు. తీరా ఆ ఫోన్ కాల్ అప్ప‌టి యూఎస్ అటార్నీ జ‌న‌ర‌ల్ బాబీ కెన్న‌డీకి వెళ్తుంది. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆ పోలిస్ స్టేష‌న్ కు ఫోన్ చేసి దొబ్బులు పెట్ట‌డంతో పోలీసులు వణికిపోయి షిర్లేను, లిప్ ను వ‌దిలేస్తారు.

త‌మ‌ను బాబీ కెన్న‌డీ విడిపించాడ‌ని లిప్ ఉబ్బిత‌బ్బిబ్బు అవుతాడు. అయితే షిర్లే  మాత్రం ఇలాంటి ప్రెటీ కేసులో సాయం కోసం కెన్న‌డీకి ఫోన్ చేయాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న భ‌రితుడవుతాడు. బాబీ కెన్న‌డీకి అంత‌కు మించి ఎన్నో గొప్ప బాధ్య‌తలుంటాయంటాడు. పోలీసుల‌పై ఎదురుతిర‌గాల్సింది కాదంటాడు. ఆ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య‌న సాగే వాదోప‌వాదాలు సినిమాకే హైలెట్.

త‌ను తెల్ల‌వాడే అయిన‌ప్ప‌టికీ.. త‌న బ‌త‌కు వీధుల్లోనే సాగుతోందంటూ టోనీ లిప్ వాపోతాడు. అమెరికాలో ఒక నల్ల‌వాడి జీవితం క‌న్నా త‌న జీవితం న‌ల్ల‌గా ఉంద‌ని, ఆర్థిక క‌ష్టాల‌తో, ఇంటి రెంటు కూడా క‌ట్టుకోలేని ప‌రిస్థితుల్లో త‌న జీవితం సాగుతోందంటూ చెబుతాడు. నువ్వు న‌ల్ల‌వాడివి అయిన‌ప్ప‌టికీ ఆర్థికంగా ఎంతో గొప్ప జీవితాన్ని అనుభ‌విస్తున్నామంటూ నిష్టూర‌మ‌డ‌తాడు. 

అయితే ఆర్థికంగా త‌ను ఎంత గొప్ప స్థితిలో ఉన్నా.. తెల్ల‌వాళ్లు త‌న‌ను న‌ల్ల‌వాడిగా చూస్తార‌ని, వివ‌క్ష‌ను అడుగ‌డుగునా అనుభ‌విస్తున్న వైనాన్ని షిర్లే ఆవేశంగా చెబుతాడు. త‌న సూటూబూటూ చూసి అటు న‌ల్ల‌వాళ్లు త‌న‌కు దూర‌దూరంగా జ‌రుగుతార‌ని, త‌నెంత ఖ‌రీదైన జీవితాన్ని అనుభ‌విస్తున్నా తెల్ల‌వాళ్లు త‌న‌ను క‌లుపుకోర‌ని వాపోతాడు.  ఇలా ఒక పేద తెల్ల‌వాడు, ధ‌నిక న‌ల్ల‌వాడి మ‌ధ్య వాగ్వాదం అమెరిక‌న్ ప‌రిస్థితుల‌కు ద‌ర్ప‌ణం ప‌డుతుంది.

త‌న అల‌వాట్లు, బ‌ల‌హీన‌త‌ల‌తో షిర్లే ప‌లు ర‌కాల ప్ర‌మాదాల్లో ప‌డుతూ ఉంటాడు. ఆ స‌మ‌యాల్లో లిప్ ర‌క్షిస్తూ ఉంటాడు. బార్లో కొంద‌రు తెల్ల‌వాళ్లు షిర్లేపై దాడి చేస్తారు. అక్క‌డ త‌న బ‌లాన్ని ఉప‌యోగించి ర‌క్షించే లిప్, తీరా షిర్లే సెక్సువ‌ల్ హ్యాబిట్ తో బుక్క‌య్యే స‌న్నివేశంలో పోలీసుల‌కు లంచం ఆఫ‌ర్ చేసే సీన్ స‌ర‌దాగా ఉంటుంది. షిర్లే హోమో సెక్సువ‌ల్. 

ఆ త‌ర‌హా కార్యక‌లాపాలు ఆ రాష్ట్రంలో నేరం కావ‌డంతో పోలీసులు షిర్లేనూ, అత‌డితో పాటు ఉండిన మ‌రో యువ‌కుడిని అరెస్టు చేస్తారు. అప్పుడు ఏ సిఫార్సులూ పని చేయ‌వ‌ని అర్థం చేసుకుని పోలీసుల‌కు లంచాన్ని ఆఫ‌ర్ చేసి త‌న బాస్ ను బ‌య‌ట‌కు తీసుకొచ్చే లిప్.. బ‌య‌ట‌కు రాగానే సీరియ‌స్ క్లాస్ తీసుకుంటాడు! ఇలాంటివి నీ కెరీర్ కు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రిస్తాడు.

ఇలా ఒక‌ట‌ని కాదు.. ఇంకా సీన్లు ఇంకా ఎన్నో ఉంటాయి. ఇంత చ‌దివాకా కూడా ఈ సినిమాను చూసే వాళ్ల‌కు ఇంకా ఎన్నో స‌ర్ ప్రైజ్ లు మిగిలే ఉన్నాయంటే.. ఈ సినిమా లోతెంతో అర్థం చేసుకోవ‌చ్చు! లైటర్ వెయిన్ లో, అదే స‌మ‌యంలో ఎన్నో లోతుల‌ను తాకుతూ, సీరియస్ మ్యాట‌ర్ ను స‌ర‌దాగా స్పృశిస్తూ, ఒక నాగ‌ర‌క‌త‌లో ప్ర‌బ‌లంగా ఉన్న జాడ్యాన్ని ఎండ‌గ‌ట్టే గొప్ప సినిమా గ్రీన్ బుక్.

ఇంత‌కీ గ్రీన్ బుక్ అంటే ఏమిటంటే.. జాతి వివ‌క్ష‌త బ‌లంగా ఉన్న ద‌క్షిణాది రాష్ట్రాల్లో అన్ని హోట‌ళ్ల‌లోకీ న‌ల్ల‌జాతివారిని రానిచ్చే వాళ్లు కాదు తెల్ల‌జాతీయులు. అలా డీప్ సౌత్ లో ప్ర‌యాణానికి వెళ్లే న‌ల్ల‌జాతీయుల‌కు వారికి ఏ హోట‌ళ్ల‌లో ఆశ్ర‌యం దొరుకుతుంది, ఎక్క‌డ వారికి తినే అవ‌కాశం ఉంటుంది.. వంటి వివ‌రాల‌తో ప్ర‌త్యేకంగా కొన్ని బుక్ ల‌ను ముద్రించే వారు‌. సౌత్ వైపు వెళ్లే ఉత్త‌రాది న‌ల్ల‌జాతి అమెరిక‌న్లు అలాంటి పుస్త‌కాన్ని త‌మ‌తో తీసుకెళ్లేవారు. వాటినే గ్రీన్ బుక్ అంటారు. త‌మ ప్ర‌యాణం మొద‌లైన‌ప్పుడు టోనీ లిప్ కు ఆ బుక్ ఇస్తాడు షిర్లే. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ పుస్త‌కాన్ని చూసుకుంటూ టోనీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

సినిమా ముగింపులో ఈ క‌థ‌కు సంబంధించిన నిజ‌జీవిత‌పు వ్య‌క్తుల‌ను చూపుతారు. ఈ ప్రయాణం ముగిసిన త‌ర్వాత, షిర్లే వ‌ద్ద‌ రెండు నెల‌ల డ్రైవింగ్ డ్యూటీ ముగిసిన త‌ర్వాత టోనీ లిప్ య‌థాత‌థంగా త‌ను గ‌తంలో ప‌ని చేసిన నైట్ క్ల‌బ్ లోనే మ‌ళ్లీ జాయిన్ అయ్యాడ‌ని, వీరిద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొన‌సాగార‌ని పేర్కొన్నారు.

-జీవ‌న్ రెడ్డి.బి