వైఎస్సార్ పేరు చెబితే ఏదైనా సాధ్యమా ?

వైఎస్ షర్మిల నిన్న మూడు రోజుల నిరాహార దీక్ష విరమిస్తూ చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అతిశయోక్తిగా కూడా అనిపించాయి. కేవలం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాలు…

వైఎస్ షర్మిల నిన్న మూడు రోజుల నిరాహార దీక్ష విరమిస్తూ చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అతిశయోక్తిగా కూడా అనిపించాయి. కేవలం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తే ఏదైనా సాధ్యమే అనేటట్లుగా ఉంది షర్మిల వ్యవహారశైలి. ఆమె తెలంగాణలోకి అడుగు పెట్టీపెట్టడంతోనే తాను తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి వచ్చానని చెప్పింది. 

ఇక్కడ అధికారంలోకి వస్తానని చాలాసార్లు అన్నది. నిన్న తాజాగా రెండేళ్లలో అధికారం తనదేనని మరోమారు గట్టిగా చెప్పింది. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని అన్నది. తాను కనుక అధికారంలోకి వస్తే లక్షల్లో ఉద్యోగాలు ఇస్తానంది. 

ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వలేని కేసీఆర్ కనీసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడింది. కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలెక్కువ అని తెలుగులో ఒక సామెత ఉంది. ప్రస్తుతం షర్మిల తరీఖా చూస్తుంటే ఆ విధంగానే ఉంది.

ఆమె నేల మీద నడవడంలేదు. రాజన్న కూతురును (తనను ) చూసి పాలకులు భయపడుతున్నారని కూడా అన్నది. తాను ఎందుకింత ఆవేశపడిపోతోంది ? రాజకీయ నాయకులంటే ఇలా ఆవేశపడిపోవాలా ? ముందుగా వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. ఆ తరువాత పాలకులను ప్రశ్నించే రీతిలో ప్రశ్నించాలి. 

కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నది. షర్మిలకు అది సాధ్యమా ? ఆమె ఏ ధైర్యంతో ఈ మాట అన్నది ? ఆమె ఇంకా పార్టీ పెట్టలేదు. పెట్టకపోతే దానికి ఊరు పేరు ఉండవు కదా. ప్రస్తుతం ఆమె ఒక పార్టీ అధినేత కాదు. కేవలం వైఎస్సార్ కూతురు మాత్రమే.

పార్టీ పెట్టాక పార్టీ అధినేతగా కూడా కేసీఆర్ మెడలు వంచలేదు. మరి ఇప్పుడు వైఎస్సార్ కూతురుగా మెడలు ఎలా వంచుతుంది ? మహా నాయకుడు వైఎస్ కూతురు అడిగింది కాబట్టి అమ్మా …నువ్వు చెప్పినట్లు ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు భర్తీ చేస్తా అంటాడా ? వైఎస్సార్ కూతురిగా చెప్పిన పని చేస్తానంది షర్మిల. చెప్పిన పని ఏం చేసింది ? ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తానని ఖమ్మం సభలో ప్రకటించింది. 

అనుకున్నట్టుగానే ఇందిరా పార్కు వద్ద దీక్ష మొదలు పెట్టి అక్కడ పోలీసులు భగ్నం చేస్తే ఇంట్లో కొనసాగించింది. ఇంతవరకు మాట తప్పకుండా చేసింది. బాగానేవుంది. మెడలు వంచి కేసీఆర్ తో ఉద్యోగాలు భర్తీ చేయించడం షర్మిల వల్ల అయ్యే పని కాదు. మరి వైఎస్సార్ కూతురుగా మాట తప్పినట్లే కదా. 

ఇక రెండేళ్లలో అధికారంలోకి రావడమంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమన్న మాట. అది సాధ్యమని షర్మిల అనుకుంటోందా? కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణా ప్రజలు షర్మిలను చూడగలరా? వైఎస్సార్ తెలంగాణాకు ఎన్నో మేళ్లు చేశారు కాబట్టి, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి అవన్నీ గుర్తు చేసుకొని షర్మిలను గెలిపిస్తారా ?

ఇక తాను అధికారంలోకి వస్తే లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తానంది షర్మిల. అధికారంలోకి వస్తుందనే అనుకుందాం. లక్షలమందికి ఉద్యోగాలు ఇవ్వగలదా? ఇప్పుడు తెలంగాణలోని నిరుద్యోగులు కేసీఆర్ ను ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే అర్ధం. అవి లక్షల్లో ఉంటాయా ? ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చేదేముంది ? .

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే కోరిక కేసీఆర్ కు బలంగా ఉన్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ పెంచేవాడే కాదు. ఆయన దృష్టి వచ్చే ఎన్నికల మీద ఉంది. ఉద్యోగులు తనకు మద్దతు ఇవ్వాలంటే వారు కోరినట్లుగా ఏజ్ లిమిట్ పెంచి తీరాల్సిందే.

ఈయన కాదన్నాడనుకోండి. అధికారంలోకి వస్తే మేం పెంచుతామని కాంగ్రెస్, బీజేపీ చెబుతాయి. ఆ భయం కేసీఆర్ కు ఉంది కాబట్టే రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. ఏ రాజకీయ నాయకుడికైనా కావాల్సింది తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలే. పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న షర్మిల రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచారని అడగలేదు ? ఉన్నవాళ్లు రిటైర్ అవుతే కొంతమందికైనా ఉద్యోగాలొస్తాయి. 

రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి అడిగితే ఉద్యోగులు షర్మిలను తీవ్రంగా విమర్శిస్తారు. తన రాజకీయాలకు ఉద్యోగుల మద్దతు కావాలి కదా. అందుకే ఆ ప్రశ్న అడగలేదు. ఇది అడగకుండా కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేయిస్తా అనడం ప్రహసనం కాక మరేమిటి ? నిరుద్యోగ సమస్య మీద షర్మిల అండ్ కో చేసే ఆందోళనను కేసీఆర్ తాటాకు చప్పుళ్లుగానే పరిగణిస్తారు తప్ప గడగడా వణికిపోరు.