రామ్ చరణ్, సుకుమార్‌ల చిత్రం షూటింగ్ వాయిదా పడింది. రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని అక్కడ కొన్ని రోజుల పాటు చిత్రీకరించారు. అయితే సమంతతో పాటు మరికొందరు బృందం ఎండ వేడిని తాళలేకపోవడంతో షెడ్యూల్ అర్ధాంతరంగా ఆపేసి వచ్చేసారు. తదుపరి షెడ్యూల్ మే నెలలో జరగాల్సి వుంటే, ఎండలు ఎక్కువగా వున్నాయంటూ జూన్‌కి వాయిదా వేసారు.
రాజమండ్రి ప్రస్తుతం అనుకూలించకపోతే, దాని స్థానంలో మరో లొకేషన్లో షూటింగ్ పెట్టుకుని డిలే కాకుండా చూసుకోవాలి. అయితే ఎండలు ఎక్కువగా వున్నాయి కనుక షూటింగ్‌కి హాజరు కాలేనంటూ చరణ్ విదేశాలకి వెళ్లిపోయాడు. దీంతో జూన్‌కి షూటింగ్ వాయిదా పడింది. అప్పటికి రాజమండ్రిలో ఎండలు తగ్గుతాయని ఎవరు చెప్పగలరు? అప్పటికీ ఎండలు తగ్గని పక్షంలో మళ్లీ వాయిదా వేస్తారా?
ఎప్పుడో ఫిబ్రవరిలోనే మొదలు కావాల్సిన చిత్రాన్ని ఏప్రిల్ వరకు గెంటుకొచ్చి, ఇప్పుడు వేసవి సాకుతో షూటింగ్ డిలే చేస్తున్నారు. దసరాకి విడుదల చేయాలని చూస్తోన్న చిత్రం ఇంతవరకు కొద్ది రోజుల షూటింగ్ కూడా జరుపుకోకపోతే ఇక సమయానికి ఎలా సిద్ధమవుతుంది? ప్రతి సినిమా మధ్య విపరీతంగా గ్యాప్ తీసుకుని కాలయాపన చేయడం, షూటింగ్ మొదలయ్యాక కూడా చిత్తశుద్ధితో పని చేయకపోవడం వల్లే చరణ్ గత చిత్రాలకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ మెగా వారసుడిలో మార్పేమీ రాలేదని ఈ వాయిదాని బట్టి స్పష్టమవుతోంది.