చిరంజీవి రీఎంట్రీ చిత్రాన్నే నిర్మించాల్సిన అల్లు అరవింద్, ఆ బాధ్యతలని రామ్ చరణ్ తీసుకోవడంతో 'ఖైదీ నంబర్ 150'కి సలహాదారుగానే సరిపెట్టారు. తదుపరి చిత్రాన్ని అరవింద్‌కే చేయాలని చిరంజీవి భావించినా కానీ, 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' లాంటి భారీ చిత్రంతో కొణిదెల ప్రొడక్షన్స్‌ని అగ్ర నిర్మాణ సంస్థల సరసన నిలబెట్టాలని చరణ్ నిర్ణయించుకోవడంతో అది కూడా తనయుడికే ఇచ్చేసారు.
'ఉయ్యాలవాడ' తదుపరి చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. చిరంజీవితో ఎన్నో చిత్రాలు నిర్మించిన అరవింద్ ఆయనతో తొంభై శాతం కమర్షియల్ చిత్రాలే తీసారు. చాలా గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి చేస్తోన్న ఈ చిత్రాన్ని కూడా చిరు స్టయిల్లో మాస్‌గానే తీయాలని అరవింద్ డిసైడ్ అయ్యారు. మాస్ చిత్రాలకి పెట్టింది పేరయిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
గీతా ఆర్ట్స్‌లో సరైనోడు తీసిన బోయపాటి శ్రీను అచ్చంగా చిరంజీవి కోసమని ఒక కథ రాసుకున్నాడట. ఇంద్ర సినిమాకి తీసిపోని హీరోయిజం, మాస్ అంశాలు ఇందులో వుంటాయట. ఈ కథ వినగానే అల్లు అరవింద్ ఓకే చెప్పారని, బౌండ్ స్క్రిప్ట్ చేయమని అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్తయ్యే దశకి ఈ చిత్రం సెట్స్ మీదకి వెళుతుందట.