కెరీర్లో చివరి వన్డే సిరీస్ కాదుగానీ, సొంతగడ్డపై బహుశా ఇదే చివరి వన్డే మ్యాచ్.. అంటూ ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి షాక్ తగిలే రిజల్ట్ వచ్చింది. రాంచీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. పైగా, ఈ మ్యాచ్‌లో ధోనీ దారుణంగా ఫెయిలయ్యాడు. ఈ మ్యాచ్ గెలిచి వుంటే, వన్డే సిరీస్ టీమిండియా కైవసం అయ్యేదే. పరాజయం కారణంగా, సిరీస్ ఫలితం మరో మ్యాచ్‌కి పోస్ట్‌పోన్ అయ్యింది.
260 పరుగులకు న్యూజిలాండ్‌ని కట్టడి చేసిన టీమిండియా, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దారుణంగా తడబడింది. ఓపెనర్ రోహిత్‌శర్మ మరోమారు ఫెయిలయ్యాడు. మూడో వన్డేలో టీమిండియాని ఆదుకున్న కోహ్లీ, ఈసారి ఫర్వాలేదన్పించినా, జట్టుకి విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. చివర్లో కాస్సేపు ధావల్ కులకర్ణి మ్యాచ్‌పై ఆశలు పెంచినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆటలో గెలుపోటములు సహజమేగానీ, ఈ మ్యాచ్ ధోనీకి కాస్తంత ప్రతిష్టాత్మకమే. సొంత గడ్డపై ధోనీ చెలరేగిపోతాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మైదానమంతా ధోనీ నినాదాలతో మార్మోగిపోయింది. ఎప్పుడైతే ధోనీ 11పరుగలకే ఆలౌట్ అయిపోయాడు, అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక, ఐదో వన్డే విశాఖలో జరగనుంది. కానీ, ఈ మ్యాచ్‌కి వరుణుడు దెబ్బకొట్టేలా వున్నాడు. తుపాను ముంచుకొస్తోన్న దరిమిలా, మ్యాచ్ నిర్వహణపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి.