అన్ని సందర్భాల్లోనూ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్.. అని అనుకోవడానికి వీల్లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించినా, అప్పీల్‌కి ఛాన్సులుంటాయి. ఆ ఛాన్స్‌ల్ని సైతం సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించని పక్షంలో, రాష్ట్రపతి వద్దకు క్షమాభిక్ష కోసం వెళ్ళవచ్చు. అయితే, న్యాయస్థానంలో ఏ కేసు నెగ్గడం అయినా, వీగడం అయినా 'సాక్ష్యాధారాల్ని' బట్టి మాత్రమే జరుగుతుంది. న్యాయవ్యవస్థను అలా నిర్వచించారు మరి.!
సరే, అసలు విషయానికొద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసేందుకు కర్నాటక రాష్ట్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. కావేరీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కర్నాటక పలుమార్లు సుప్రీంకోర్టులోనే సవాల్ చేసింది. ప్రతిసారీ మొట్టికాయలే తప్ప, కర్నాటకకి ఊరట లభించడంలేదు. 'మేం ఇచ్చిన తీర్పు ఫైనల్.. తీర్పుని యధాతథంగా అమలు పర్చాల్సిందే..' అని పదే పదే సుప్రీంకోర్టు తెగేసి చెబుతోంది.
కానీ, ఏదీ.. ఎక్కడ.? 'మేం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయలేకపోతున్నాం.. అమలు చేయలేం..' అని కర్నాటక తాజాగా తేల్చి చెప్పింది. పంచాయితీని కేంద్రం ముందుకు తీసుకెళ్ళింది కర్నాటక. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కర్నాటక, తమిళనాడు ప్రభుత్వ పెద్దలు రేపు సమావేశమవుతారట. అదేంటీ, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, దాన్ని పక్కన పెట్టడమేంటి.? అంటే, కర్నాటకలో చాలామంది, 'మాకు అన్యాయం జరిగింది..' అంటూ వాపోతున్నారు. అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారి దృష్టిలో 'అన్యాయం' అనే కదా.! సాక్షాత్తూ ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేం.. అనేస్తే, ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు విలువెక్కడ.?
కాస్త వెనక్కి వెళితే, సుప్రీంకోర్టు పెత్తనాన్ని కేంద్రం పలుమార్లు ప్రశ్నించింది. పలు అంశాలపై చట్టసభల్లో చర్చ సందర్భంగా, పార్లమెంటు వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదు.. అంటూ కేంద్ర మంత్రులే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్ని, ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవడంలేదన్న విమర్శ, న్యాయ నిపుణుల నుంచే కాదు, న్యాయమూర్తుల నుంచి కూడా పలు సందర్భాల్లో వ్యక్తమయ్యింది.
వాస్తవానికి కర్నాటక, తమిళనాడుల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం మీదనే వుంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక, ఆ తీర్పు ఓ రాష్ట్రానికి నచ్చనప్పుడు, పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్రమే. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని అమలు చేయడంలేదని ఓ రాష్ట్రం చెబితే దండించాల్సింది కూడా కేంద్రమే. కానీ, ఇక్కడ కేంద్రం చోద్యం చూస్తోంది. న్యాయవ్యవస్థకే ఇప్పుడు అన్యాయం జరుగుతోంది. న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు విఘాతం కలుగుతోందిప్పుడు. దీనికి కారణం కర్నాటక రాష్ట్రం మాత్రమే కాదు, కేంద్రం కూడా.!
ఇదొక్కటే కాదు, బీసీసీఐలో సంస్కరణలకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన లోథా కమిటీ ఇచ్చిన సూచనల్ని బీసీసీఐ పట్టించుకోకపోవడమూ కోర్టు ధిక్కరణగానే పరిగణించాల్సి వుంటుంది. ఎందుకిలా జరుగుతోంది.? న్యాయవ్యవస్థ విషయంలో రాజకీయ పెత్తనం హద్దులు దాటిపోయిందా.? ఈ పరిస్థితి ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.? వేచి చూడాల్సిందే.