ప్రజాస్వామ్యంలో పాలకుడు.. అంటే ప్రజలకు సేవకుడు అని అర్థం. అంతే తప్ప, రాచరికంలోలా ప్రజల్ని భక్షించేవాడు కానే కాదు. మన ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ వుంది. దాన్ని హరించేస్తే ఎలా.?
రాజకీయం అన్నాక ఆరోపణలుండాలి.. అప్పుడే రాజకీయాల్లో కిక్కుంటుంది.. అనుకునే రోజులివి. ఎవరు ఎంత ఎక్కువ ఆరోపణలు చేస్తే, రాజకీయాల్లో వారు అంత యాక్టివ్గా వున్నట్లు లెక్క. ఇప్పుడున్న రాజకీయాలు అలా తగలడ్డాయ్. ఆరోపణల విషయంలో ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువా కాదు. ప్రధాన మంత్రిని పట్టుకుని చప్రాసీ.. అన్న రోజుల్ని మర్చిపోయారాయన. సమైక్య పాలనలో మంత్రిగా వున్న రోజుల్నీ మర్చిపోయారు. కాంగ్రెస్తో అంటకాగిన రోజులు అసలే గుర్తులేవాయె.
ఆయనెవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుగారు. తన మీదగానీ, తెలంగాణ ప్రభుత్వమ్మీదగానీ ఎవరైన అసత్యారోపణలు చేస్తే జైలు కూడు తినాల్సిందేనట. కామెడీకి పరాకాష్ట ఇది. బహుశా కేసీఆర్, బ్రిటిషోళ్ళతో పోటీపడదలచ్చుకున్నారేమో.! తప్పు చేస్తే జైలు కూడు తింటారా.? లేదా.? అన్నది న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. ఆ మాట చెప్పడానికి కేసీఆర్ ఎవరు.? కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రిలా కాదు, రాచరిక కాలంలో రాజుగా వున్నట్లే వ్యవహరిస్తున్నారాయన.
తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసినా, కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేసినా, వాటిని ఖండించే అవకాశం అధికారంలో వున్న టీఆర్ఎస్కి వుండనే వుంది. ఇంకా గట్టిగా ఆ ఆరోపణలు మనసుకి గుచ్చుకుంటే, పరువు నష్టం దావా వేసేందుకూ అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అవన్నీ మర్చిపోతే ఎలా.?
టీడీపీలో వున్నప్పుడు, ఆ పార్టీలో కీలక నేతగా పనిచేసినప్పుడు, మంత్రిగా పదవులు వెలగబెట్టినప్పుడు.. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల గురించి ఏనాడూ కేసీఆర్ నోరు మెదపలేదాయె. కాంగ్రెస్తో అంటకాగినప్పుడు, కేంద్రంలో మంత్రిగా వెలిగినప్పుడూ ఆయనగారికి తెలంగాణలో రైతాంగం గురించి సోయే లేదాయె. అది గతం. ఆయనెలాగైతే విపక్షాల్ని విమర్శిస్తున్నారో.. విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు దూసుకొస్తాయి కదా. విమర్శల్ని పాలకులు సహించలేకపోతే, అసలు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు.
సుప్రీంకోర్టు తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనుద్దేశించి 'ప్రతి విషయానికీ పరువునష్టం దావాకి సిద్ధమవ్వొద్దు.. ప్రజాక్షేత్రంలో వున్నారు.. విమర్శల్ని ఎదుర్కోవాలి..' అంటూ మొట్టికాయలేసింది. రేప్పొద్దున్న, తెలంగాణలోనూ విపక్షాలపై కేసులు పెట్టాలని కేసీఆర్ అనుకుంటే, ఇక్కడా అదే పరిస్థితి రిపీట్ కావొచ్చుగాక. అఫ్కోర్స్.. న్యాయస్థానంతో మొట్టికాయలేయించుకోవడం కొత్తేమీకాదులెండి.