కుంబ్లే విశ్వరూపం చూపించేస్తాడా.?

ఒకప్పుడు మైదానంలో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేసిన అనిల్‌ కుంబ్లే, ఇప్పుడు కోచ్‌ హోదాలో టీమిండియాకి మార్గదర్శిగా మారాడు. కోచ్‌ అంటే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయిస్తుంటాడు.. జట్టుకి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు…

ఒకప్పుడు మైదానంలో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేసిన అనిల్‌ కుంబ్లే, ఇప్పుడు కోచ్‌ హోదాలో టీమిండియాకి మార్గదర్శిగా మారాడు. కోచ్‌ అంటే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయిస్తుంటాడు.. జట్టుకి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నేర్పిస్తుంటాడు. జట్టుని సమన్వయం చేస్తాడు. అయితే, అవి మాత్రమే చేస్తే అతను కుంబ్లే ఎందుకవుతాడు.? 

అవును, కుంబ్లే.. జట్టులో తానూ ఓ సభ్యుడిలా మారిపోయాడు. బ్యాటింగ్‌ చేస్తున్నాడు, బౌలింగ్‌ చేస్తున్నాడు, ఫీల్డింగ్‌ కూడా చేస్తున్నాడు.. అయితే ఇదంతా జస్ట్‌ ప్రాక్టీస్‌లో భాగం మాత్రమే. వయసు మీద పడ్డా, కుంబ్లేలో మునుపటి జోష్‌ తగ్గలేదు. బంతిని కుంబ్లే తిప్పేస్తోంటే, యంగ్‌ టీమిండియా ఆశ్చర్యపోతోంది. కుంబ్లే స్పిన్నర్‌ అని చాలామందికి తెలుసు. కానీ, అందరికీ తెలియని విషయమేంటంటే, కుంబ్లే ఫాస్ట్‌ బౌలర్‌. ప్రపంచ క్రికెట్‌లో కుంబ్లే అంత వేగంగా బంతులు విసరగలిగే స్పిన్నర్‌ ఇంకొకరు లేరనడం అతిశయోక్తి కాదేమో. ఫాస్ట్‌ బౌలింగ్‌ నుంచి స్పిన్నర్‌గా కెరీర్‌ ప్రారంభించకముందే మారిపోయాడు కుంబ్లే. అదిప్పుడు టీమిండియాకి బాగా కలిసొస్తోంది. 

ఏ బ్యాట్స్‌మెన్‌ వీక్‌నెస్‌ ఏంటి.? ఏ బౌలర్‌ ఎక్కడ ఫెయిలవుతున్నాడు.? ఫీల్డింగ్‌లో ఎవరి లోపాలేంటి.? ఇవన్నీ కుంబ్లే స్టడీ చేసేశాడు. అందుకే, ఎవరికి ఎలా కోచింగ్‌ ఇవ్వాలో అలా ఇచ్చేస్తున్నాడు. కోహ్లీ సహా టీమిండియాలో అందరికీ కుంబ్లే ఇస్తున్న సూచనలు బాగా ఉపయోగపడ్తున్నాయట. కుంబ్లే నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తోంటే ఆశ్చర్యపోయామంటూ టీమిండియా క్రికెటర్లు చెబుతున్నారు. 

అంతా బాగానే వుందిగానీ, కుంబ్లే తొలి పరీక్ష (కోచ్‌గా) ఏమవుతుంది.? టీమిండియా కుంబ్లే అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తుందా.? కుంబ్లే సలహాలు టీమిండియాకి ఏ మేరకు ఉపయోగపడగలవు.? అన్నది వేచి చూడాల్సిందే.